గాంధీ జయంత్యుత్సవాల్లో ఖైదీల విడుదలకు కేంద్రం మార్గదర్శకాలు
మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్రం విడుదల చేయడానికి నిర్ణయించే ఖైదీల్లో హత్య, అత్యాచారం, అవినీతి వంటి తీవ్రమైన కేసుల్లో శిక్ష పడిన వారెవరికీ క్షమాభిక్ష ఉండదు. రాజకీయ నాయకులు సహా అందరికీ ఇది వర్తిస్తుంది. 2018 అక్టోబరు 2 నుంచి ఏడాది పాటు గాంధీ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రకటించింది.
ఈమేరకు 2018 గాంధీ జయంతి నుంచి 2019 ఏప్రిల్ 6, అక్టోబరు 2 తేదీల్లో విడతవారీగా అర్హులైన ఖైదీను విడుదల చేస్తారు.
ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపించిన కేంద్రం అర్హులైన వారి జాబితాను ఆగస్టు 15 నాటికి రూపొందించాల్సిందిగా తెలిపింది. ఈమేరకు విధి విధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
విడుదలకు అర్హతలు..
ఖైదీల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లు 55, పురుషులు 60 ఏళ్లు నిండినవారై ఉండాలి. వాస్తవ జైలుశిక్షలో 50 శాతం పూర్తిచేసి ఉండాలి.
వైద్యబోర్డు నిర్ధారించిన మేరకు 70 శాతానికి పైగా వైక్యం ఉన్న వ్యక్తులు, జబ్బుపడిన వారినీ పరిగణలోకి తీసుకుంటారు. వాస్తవశిక్షలో 66 శాతం పూర్తిచేసి ఉండాలి. శిక్ష ప్రారంభమైన నాటినుంచీ సత్ప్రవర్తనతో మెలగాలి.
విడుదలకు అనర్హతలు..
మరణశిక్ష విధించేంత నేరానికి పాల్పడినవారు, పడిన శిక్షల్లో యావజ్జీవం కూడా ఉన్నవారు. ఉగ్రవాదం తదితర విద్రోహ కార్యకలాపాలు, తీవ్ర ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, నకిలీ నోట్ల తయారీ, మానవ అక్రమ రవాణా, అవినీతి, వరకట్న హత్యలు వంటి నేరాలను నిరోధించే చట్టాలతో పాటు పోక్సో, భారత శిక్షాస్మృతిలోని 489 (ఏ నుంచి ఈ) సెక్షన్ కేసుల్లో శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష ఉండదు.
అలాగే రాష్ట్రాలకు వ్యతిరేకంగా వివిధ కార్యకలాపాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్నవారు, రాష్ట్రాలు తీవ్రంగా పరిగణించే వివిధ చట్టాల కింద శిక్షపడిన వారు విడుదలకు అనర్హులు.