అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా తగ్గించింది. 2018లో 7.3%, 2019లో 7.5% వృద్ధి నమోదు కాగలదని తాజాగా లెక్కగట్టింది.
2017లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో అంచనా వేసిన వృద్ధి రేట్లలో 0.1% (2018), 0.3% (2019) చొప్పున అంచనాల్ని తాజాగా సవరించింది. ముడి చమురు వినియోగం అధికం కావడం, ద్రవ్యోల్బణం అంచనాల్ని మించి పెరగడంతో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షను కఠినతరం చేస్తుందని, దీంతో వృద్ధి స్వల్పంగా తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక తేల్చింది. అయితే చైనాతో పోలిస్తే భారత వృద్ధి గణనీయంగా ఉంటుందని పేర్కొంది.
2018లో చైనా వృద్ధి రేటు 6.6%, 2019లో 6.4% ఉండవచ్చని ఐఎంఎఫ్ వెల్లడించింది.
ప్రపంచ వృద్ధి 3.9%
ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ)లో ప్రపంచ వృద్ధి రేటు 3.9 శాతానికి (2018, 2019) చేరొచ్చని అంచనా వేసింది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో విస్తరణ రేటు అధిక స్థాయికి చేరిందని, వృద్ధి మాత్రం తగ్గుతోందని తెలిపింది.
అమెరికాలో స్వల్పకాలానికి వృద్ధి బలోపేతం అవుతుందని పేర్కొంది. గత కొన్ని వారాల నుంచి యూఎస్ డాలర్ 5% బలోపేతం కావడమే దీనికి నిదర్శనమని వెల్లడించింది.
చాలా దేశాల్లో వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వాలు వృద్ధి రేటు పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించింది. యూరో జోన్, జపాన్, యూకే వృద్ధి రేట్లను కూడా ఐఎంఎఫ్ తగ్గించింది.