Current Affairs Telugu Daily

తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్‌ ఛైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్లు 
తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్‌ ఛైర్మన్‌గా వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన తెరాస నేత నాగుర్ల వెంకటేశ్వర్లు (49) నియమితులయ్యారు.
  • ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఫైల్‌పై 2018 జులై 14న సంతకం చేసి, ఉత్తర్వులు జారీకి ఆదేశించారు.
  • పరకాల మండలం నర్సక్కపల్లెలోని రైతు కుటుంబానికి చెందిన నాగుర్ల పాలిటెక్నిక్‌ పూర్తి చేశారు. 2011లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సమయంలో ఆ పార్టీలో చేరి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
  • జిల్లా పరిషత్‌ సభ్యునిగా ఎన్నికై, వరంగల్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిన్న, సన్నకారు రైతు, వ్యవసాయ కార్మికుల, చేతివృత్తుల వారికి రుణాల నుంచి విముక్తి కోసం అవసరమైన సాయం అందించేందుకు  2016 మార్చి 30న చట్టం చేసింది.
  • దానికి అనుగుణంగా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఛైర్మన్‌ నియామకంలో జాప్యంపై కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది.
  • మొదట్లో చట్ట ప్రకారం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమించాల్సి ఉండగా దానికి బదులుగా న్యాయ, వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో అనుభవం, నైపుణ్యం ఉన్న ప్రముఖ వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించేందుకు వెసలుబాటు కల్పించింది.
  • హైకోర్టులో విచారణ దృష్ట్యా సత్వరమే కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నాగుర్ల వెంకటేశ్వర్లును ఈ పదవిలో నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

views: 1119Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams