Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ 2018 జులై 10న ఉత్తర్వులు జారీ చేసింది.
  • ప్రభుత్వం నియమించే ఛైర్మన్‌తో పాటు సాధారణ పరిపాలన, న్యాయ, కార్మిక, పర్యాటక, సాంస్కృతిక, విద్యాశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో  తెలుగు సాహిత్యం, పరిపాలన, చట్టం వంటి అంశాలో నిపుణులైన నలుగురు సభ్యులు ఉంటారు.
  • సంస్థ సీఈవో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రాధికార సంస్థ ద్వారా ప్రత్యేకంగా 5 కమిటీలను వేసి, భాషకు పునరుత్తేజం కల్పించేందుకు కృషి చేయనున్నారు.
  • తెలుగు అమలు, విద్యావిధానంలో అంతర్భాగంగా తెలుగు భాషాభివృద్ధి, ఈ-తెలుగు అభివృద్ధి, ప్రచురణలు, అనువాదం, అంతర్జాతీయంగా తెలుగు అభివృద్ధి వంటి అంశాలో ఈ కమిటీలు సేవలందించనున్నాయి.
  • అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వపరంగా ప్రజలు వినియోగించే ప్రతి దరఖాస్తు, రికార్డును తెలుగులో అందుబాటులో ఉంచడంపై దృష్టిసారిస్తుంది. ప్రత్యేకించి న్యాయస్థానాల తీర్పు సైతం తెలుగులో ఉండేలా సమన్వయం చేయాలన్నది సర్కారు ఆలోచన.
  • అధికార భాషగా తెలుగు అమలు అవుతుందా లేదా అనేదానిపై సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటుంది.
  • అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న అన్ని పదాలకు తెలుగులో పదకోశాన్ని సిద్ధం చేస్తారు. అన్ని రకాల నామ ఫలకాలు, గోడపత్రికలు ఇలా ప్రతి విషయంలోనూ తెలుగుదనం కనిపించేలా చర్యలు తీసుకుంటుంది.
  • తెలుగు పాఠ్యపుస్తకాల స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించడం, ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థుల అభ్యాసన స్థాయులను పరిశీలించడం, ప్రధానంగా తల్లిదండ్రులను ఈ క్రమంలో చైతన్యపరచటం, తెలుగేతర విద్యార్థులు తెలుగు నేర్చుకునేలా శిక్షణ తరగతులు నిర్వహణలాంటివి క్రియాశీలకం కానున్నాయి.
  • ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనుంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో తెలుగును అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపచేసేందుకు చర్యలు తీసుకోనుంది.
  • హిందీ రాష్ట్రాలో సైతం మూడోభాషగా తెలుగు ఉండేలా చూడటం, సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్న గ్రామాల్లోని తెలుగు ప్రజల భాష పట్ల మక్కువ చూపేలా ప్రత్యేక పథకాలు అమలుచేయనుంది.
  • తెలుగు భాషాభివృద్ధి నిధి పేరిట రూ.25కోట్లు మంజూరు చేశారు.
  • రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామఫలకాలను ఏర్పాటు చేయకపోతే రూ.50 వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. శిలాఫలకాలు, గోడపత్రికల్లో ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా తెలుగు వినియోగించాలి.
  • లేదంటే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. నిబంధన మేరకు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖకు రూ.5 వేలు అపరాధ రుసుము విధిస్తారు.
  • తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే రూ.50 వేల జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష తప్పదు.

views: 976

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams