Current Affairs Telugu Daily

అవెన్‌ఫీల్డ్‌ కేసులో నవాజ్‌ షరీఫ్‌కు 10 సం॥ల జైలుశిక్ష 
పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించిన కేసులో పాకిస్థాన్‌ పదవీచ్యుత ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు 10 సం॥ల జైలుశిక్ష విధిస్తూ ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక కోర్టు 2018 జులై 6న తీర్పు చెప్పింది.
 • ఆయనకు 80 లక్షల పౌండ్ల జరిమానానూ విధించింది. నేరం చేసేలా ప్రోత్సహించినందుకు ఆయన కుమార్తె మరియమ్‌కు ఏడేళ్ల కఠిన కారాగారవాసం, 20 లక్షల పౌండ్ల జరిమానాను ఖరారు చేసింది.
 • అవినీతి నిరోధక శాఖకు సహకరించనందుకు ఆమెకు మరో ఏడాది కారాగార వాసాన్ని విధించింది.
 • ఈ రెండు జైలు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు పేర్కొన్నందువల్ల మొత్తంమీద ఆమె ఏడేళ్లపాటు జైల్లో ఉండాలి. అధికారులకు సహకరించలేదంటూ నవాజ్‌ అల్లుడు మహ్మద్‌ సఫ్దర్‌కు ఏడాది జైలుశిక్షను కోర్టు విధించింది.
 • ఈ తీర్పు వల్ల మరియమ్‌, సఫ్దర్‌లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులయ్యారు.
 • సంచలనం సృష్టించిన పనామా పత్రాల్లో నవాజ్‌ షరీఫ్‌ పేరు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి ఆయన అనర్హుడని సుప్రీంకోర్టు 2017లో ప్రకటించింది.
 • ఆయన, బంధువులపై అవినీతి కేసు పెట్టాలని ఆదేశించింది. దీంతో నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆయన కుటుంబంపై మూడు కేసులను జాతీయ జవాబుదారీ బ్యూరో నమోదు చేసింది.
 • అందులోని మొదటిదైన అవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసుపై తాజా తీర్పు వెలువడింది. లండన్‌లోని విలాసవంతమైన ‘అవెన్‌ఫీల్డ్‌ హౌస్‌’లో 4 ఫ్లాట్లను నవాజ్‌ కుటుంబం కొనుగోలు చేయడంపై ఈ కేసు దాఖలైంది.
 • నవాజ్‌, ఆయన కుమార్తె, అల్లుడుతోపాటు కుమారులు హసన్‌, హుస్సేన్‌లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిని పరారీలో ఉన్న నిందితులుగా కోర్టు ప్రకటించింది.
 • 1990లో నవాజ్‌ రెండుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించారని, నాటి అవినీతి సొమ్ముతోనే ఈ ఫ్లాట్లను కొనుగోలు చేశారని ఎన్‌ఏబీ వాదించింది. చట్టబద్ధ డబ్బుతోనే వాటిని సమకూర్చుకున్నామని నవాజ్‌ చెప్పారు.
 • దీనిపై జవాబుదారీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ బషీర్‌ జులై 6న తీర్పు వెలువరించారు. తీర్పును 7రోజుల పాటు వాయిదా వేయాలన్న నవాజ్‌ కుటుంబ విజ్ఞప్తిని తిరస్కరించారు.
 • తీర్పు వెలువడే సమయానికి నవాజ్‌, మరియమ్‌లు లండన్‌లోని అవెన్‌ఫీల్డ్‌ అపార్ట్‌మెంటులోనే ఉన్నారు.
 • నవాజ్‌ భార్య కుల్సూమ్‌ గొంతు క్యాన్సర్‌తో లండన్‌లో చికిత్స పొందుతున్నందువల్ల వారు లండన్‌లో ఉంటున్నారు.
 • ఆయన కుమారులు అక్కడే ఉన్నారు. నిందితులకు శిక్షనలు ఖరారు చేసిన న్యాయమూర్తి.. అవెన్‌ఫీల్డ్‌ అపార్ట్‌మెంట్లను పాకిస్థాన్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాని ఆదేశించారు.
 • తీర్పును సవాల్‌ చేసేందుకు నిందితులకు పది రోజుల గడువు ఇచ్చారు. 
 • పాకిస్థాన్‌ 70 ఏళ్ల చరిత్ర గమనాన్ని మార్చేందుకు ప్రయత్నించడం వల్లే తనను శిక్షించారని నవాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. 
నవాజ్‌ షరీఫ్‌ పార్టీ - పాకిస్థాన్‌ పీపుల్స్‌ లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌)

views: 931

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams