మార్క్‌ 3డీ 1 ప్రయోగం విజయవంతం 
మార్క్‌ 3డీ 1 ప్రయోగం విజయవంతం 
ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. సోమవారం శ్రీహరి కోట నుంచి భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ 3డీ 1 ప్రయోగం విజయవంతమైంది. 16 నిమిషాల 20 సెకన్లలో జీశాట్‌ 19ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపప్రహం కోసం శాస్త్రవేత్తలు గత 18 ఏళ్లుగా కృషి చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ బరువైన ఉపగ్రహాల ప్రయోగంలో అగ్రదేశాల సరసన చేరినట్లైంది. జీశాట్‌ 19 ఉపగ్రహం బరువు 3,316 కిలోలు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనుల మధ్య తమ ఆనందోత్సాహాలను పంచకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ భారత అంతరిక్ష ప్రయోగంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోనుందని వ్యాఖ్యానించారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ప్రయోగం ఇస్రో చరిత్రలో కొత్త అధ్యాయమని అన్నారు. మరికొందరు ముఖ్య శాస్త్రవేత్తలు సైతం తమ ఆనందాన్ని పంచుకున్నారు.

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ1 విశేషాలు..: రాకెట్‌ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్‌200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్‌110 లిక్విడ్‌ కోర్‌ ఇంజిన్‌, మూడో దశలో సీ25 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్‌-19 ఉపగ్రహం రాకెట్‌ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళుతుంది.

జీశాట్‌-19తో 4జీ మరింత మెరుగ్గా..: జీశాట్‌-19 ఉపగ్రహంలో కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీని ద్వారా హైస్పీడు ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి. 4జీ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది. పాత తరానికి చెందిన ఐదారు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు అందించిన సేవలను ఇదొక్కటే అందిస్తుంది. ఇందులోని అధునాతన పరిజ్ఞానమే అందుకు కారణం. పదేళ్ల పాటు ఇది సేవలు అందిస్తుంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యంత బరువువైన ఉపగ్రహాలను మన గడ్డ నుంచే కక్ష్యలోకి పంపే సత్తా చేకూరుతుంది. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ఇప్పటి వరకు ఏరియన్‌ రాకెట్‌పై ఆధారపడుతోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. రూ.400 కోట్ల మేర ఖర్చూ తగ్గుతుంది. 4,500-5,000 కిలోల బరువు గల ఇన్‌శాట్‌-4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతుంది. మానవసహిత యాత్రలకూ వీలుకలుగుతుంది. గురుడు, శుక్రుడు వంటి గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే వీలుంటుంది.

views: 108
Vyoma Current Affairs
e-Magazine
Monthly Wise
FREE Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.