Current Affairs Telugu Daily

సూర్యునిపైకి పార్కర్ ప్రోబ్
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సౌరయానానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా వచ్చే సంవత్సరంలో సూర్యుడి సమీపంలోకి వ్యోమనౌకను పంపటానికి సన్నాహాలు చేస్తోంది. ఇది సూర్యుడి వాతావరణాన్ని అన్వేషించి.. చాలాకాలంగా శాస్త్రవేత్తలకు కొరుకుడు పడని వివరాలు అందించగలదని భావిస్తున్నారు. సుమారు 60 ఏళ్ల క్రితమే సౌరగాలుల ఉనికిని అంచనా వేసిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజినీ పార్కర్‌ గౌరవార్థం దీనికి ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ అని పేరు పెట్టామని నాసా తెలిపింది. ఒక వ్యోమనౌకకు మనుషుల పేరు పెట్టటం ఇదే తొలిసారని వివరించింది. సుమారు చిన్న కారు సైజులో ఉండే దీని లోపల సూర్యుడి రహస్యాలను ఛేదించగల అధునాతన పరికరాలను జోడిస్తారు. సూర్యుడి ఉపరితలం కంటే కూడా సూర్యుడి చుట్టూ కిరీటంలా వెలిగే పొర ఎందుకు వేడిగా ఉంటుందో అనేదీ ఇవి పరిశీలిస్తాయి. అత్యంత వేడి, రేడియేషన్‌ పరిస్థితులను తట్టుకుంటూ ఇది సూర్యుడి వాతావరణం గుండా ప్రయాణించి గతంలో ఏ అంతరిక్షనౌక వెళ్లనంతగా సూర్యుడి సమీపంలోకి చేరుకుంటుందని నాసా తెలిపింది. సూర్యుడి వేడిని తట్టుకునేలా దీనికి 4.5 అంగుళాల మందమైన కార్బన్‌ సమ్మిళిత పొర రక్షణ కల్పిస్తుందని వివరించింది. ఈ వ్యోమనౌకను 2018లో జులై 31 నుంచి 20 రోజుల వ్యవధిలో ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఎట్టకేలకు సౌర గాలుల్లో ఏం జరుగుతుందో సవివరంగా పరిశీలించే తరుణం ఆసన్నం కావటం ఉత్సుకతను కలిగిస్తోందని, అక్కడ ఏదో ఒక ఆశ్చర్యకర అంశం వెలుగులోకి రాకపోదని షికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పార్కర్‌ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే తొలిసారిగా వచ్చే సంవత్సరంలో సూర్యుడి సమీపంలోకి వ్యోమనౌకను పంపటానికి సన్నాహాలు
  • ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త యూజినీ పార్కర్‌ గౌరవార్థం దీనికి ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ అని పేరు
  • ఒక వ్యోమనౌకకు మనుషుల పేరు పెట్టటం ఇదే తొలిసారి
  • 2018లో జులై 31 నుంచి 20 రోజుల వ్యవధిలో ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.

views: 819

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams