భారత్లో తొలిసారిగా రోబో సాయంతో బాలుడి కడుపులో కణితి తొలగింపు
భారత్లో తొలిసారిగా 14 ఏళ్ల బాలుడి కడుపులోని కణితిని రోబో సాయంతో వైద్యులు తొలగించారు. కడుపులోని అధివృక్క గ్రంథిపై అరుదుగా కణితులు ఏర్పడుతుంటాయి. ప్రధాన రక్తనాళాలకు దగ్గరగా ఉండటంతో వీటిని ఓపెన్ సర్జరీ ద్వారా జాగ్రత్తగా వైద్యులు తొలగిస్తుంటారు.
ప్రస్తుత కేసులో బాలుడి కడుపులోని అధివృక్క గ్రంథిపై ఎడమవైపు 8.సెం.మీ. మందమైన కణితిని డిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి నిపుణులు గుర్తించారు. అంతేకాదు బాధిత బాలుడిలో కెటాక్లోవామైన్ హార్మోన్ స్థాయిూ ఎక్కువగా వున్నట్లు పరీక్షల్లో తేలింది. అయితే క్లోమంతోపాటు ప్రధాన రక్తనాళాలకు ఈ కణితి దగ్గరగా ఉంది. పైగా అతడి కడుపుపై చిన్న కోత పెట్టేందుకు మాత్రమే వీలుంది.
దీంతో ఓపెన్ సర్జరీకి బదులుగా రోబో సాయంతో శస్త్రచికిత్స నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సిస్, మెటబాలిక్, అండ్ బేరియాట్రిక్ (ఐఎంఏఎస్) నిపుణులు వివేక్ బిందాల్ నిర్ణయించారు. ఆయన నేతృత్వంలోని వైద్యుల బృందం రెండు గంటలు శ్రమించి చికిత్సను పూర్తిచేసింది.