Current Affairs Telugu Daily

అమరావతిలో కార్పొరేట్‌ స్ట్రీట్‌ 
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేట్‌ స్ట్రీట్‌ ఏర్పాటు చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA) నిర్ణయించింది. అందుకు ఎన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీచేసింది. రాజధానిలోని ప్రధాన అనుసంధాన రహదారి(సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) వెంబడి కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలన్నది ఆలోచన. ఒక్కో సంస్థకు వాటి సామర్థ్యం, అవసరాన్ని బట్టి అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం  ఇవ్వాలన్నది ప్రతిపాదన. బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొని ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసిన వారికే స్థలం కేటాయిస్తారు. 
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా కార్పొరేట్‌ సంస్థల రాష్ట్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ కార్యాలయాలన్నీ అక్కడే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారూ రిజిస్టర్డ్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే కొనసాగిస్తున్నారు. కొన్ని జాతీయ, బహుళజాతి సంస్థల కార్యాలయాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
  • కార్పొరేట్‌ సంస్థలు ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యాలయాల్ని అమరావతిలో ఏర్పాటుచేసేలా ప్రోత్సహించే లక్ష్యంతోనే కార్పొరేట్‌ స్ట్రీట్‌ ప్రతిపాదనను CRDA రూపొందించింది.
  • ప్రముఖ సంస్థల కార్పొరేట్‌ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేస్తే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి.
  • 2050 నాటికి అమరావతిని ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు ఇక్కడికి తరలి రావడం ఎంతో అవసరమని సీఆర్‌డీఏ భావిస్తోంది.
  • కార్పొరేట్‌ స్ట్రీట్‌కి ఈఓఐలో భాగంగా దరఖాస్తు చేయాలనుకునే సంస్థలకు CRDA కొన్ని అర్హతలు నిర్దేశించింది. 2014-15 నుంచి 2016-17 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లోను కనీస వార్షిక లావాదేవీలు(టర్నోవరు) రూ.500 కోట్లు ఉండాలని తెలిపింది.
  • భారత కంపెనీ చట్టం కింద నమోదై ఉండాలన్నది మరో షరతు. ఈఓఐ దరఖాస్తు గడువు ముగిసే తేదీ నాటికి కనీసం 10 సం॥ ముందు కంపెనీ ఏర్పాటై ఉండాలన్నది మరో నిబంధన. దరఖాస్తుతో పాటు సంస్థ ఆవిర్భావానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం(ఇన్‌కార్పొరేషన్‌ సర్టిఫికెట్‌) జత చేయాలని సీఆర్‌డీఏ సూచించింది.
  • దరఖాస్తుదారులు తాము ఏ అవసరం కోసం స్థలం  తీసుకోవాలనుకుంటున్నామో కూడా చెప్పాలి. దీనికి ప్రత్యేకమైన ఫార్మాట్‌ ఉంది. అమరావతిలో ఏర్పాటుచేసే కార్పొరేట్‌ కార్యాలయం ఏ స్థాయిదో, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందో స్పష్టం చేయాలి. ఎంత స్థలం  కావాలనుకుంటున్నారో,  కారణాలేంటో వివరించాలి.
  • ఆ స్థలంలో నిర్మించే కార్పొరేట్‌ భవనం నిర్మితప్రాంతం ఎంతుంటుందో, ఎందరికి ఉపాధి కల్పిస్తారో చెప్పాలి. ఆ సంస్థ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి, ఈ ప్రాంతం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో వివరించాలి.
APCRDA- Andhra Pradesh Capital Region Development Authority

views: 771

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams