తూత్తుకుడి ఘటనపై దర్యాప్తునకు జస్టిస్ అరుణాజగదీశన్ కమిషన్ ఏర్పాటు
తమిళనాడులోని తూత్తుకుడిలో 2018 మే 23న జరిగిన పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడి కలెక్టరు కార్యాలయాన్ని 2018 మే 22న ముట్టడించడానికి ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్ రాగి కర్మాగారం విస్తరణను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్మాగారాన్ని విస్తరిస్తే పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని ఫాతిమాబాబు అనే పర్యావరణవేత్త దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ ఎం.సుందర్, జస్టిస్ అనితా సుమంత్‌లతో కూడిన ధర్మాసనం స్పందించింది.
దేశంలో పర్యావరణ యంత్రాంగం విఫలమైందని ట్యుటికోరిన్ సంఘటన రుజువు చేసిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆవేదన వ్యక్తం చేసింది. కర్మాగారాన్ని మూసివేయాలని సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ సూచించారు.
ట్యుటికోరిన్‌లో జరిగిన కాల్పుల ఘటనపై వేదాంత లిమిటెడ్ విచారం వ్యక్తం చేసింది. తమ కంపెనీ ఉద్యోగులకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంది.
కాల్పులు జరగడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనపై దర్యాప్తు చేయడానికి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణాజగదీషన్ అధ్యక్షతన ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది.