Current Affairs Telugu Daily

విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణకు కేంద్రం నివేదిక 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడానికి ఏకాభిప్రాయలేమే ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ అనేక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయని.. వీటిలో 9, 10 షెడ్యూళ్ల సంస్థలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వివిధ శాఖలు, సంస్థలకు సంబంధించిన కేంద్ర నిధులు, పన్నుల వాటా బదలాయింపులపైనా వివాదం నెలకొందని వివరించింది. స్వరాష్ట్రానికి వెళ్లాలనుకునే ఉద్యోగులకు అవకాశాలు.. తదితర అంశాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొంది. ఉమ్మడి ఏపీ విభజన జరిగి నాలుగేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్రం నివేదిక రూపొందించి.. ఏపీ, తెలంగాణకు పంపింది. 
ముఖ్యాంశాలు..
ఏపీ వాదన
  • ఏపీ భవన్‌ విభజన జరగాలి. ఏపీ జెన్‌కోకి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలి. 
  • 45 పదో షెడ్యూల్‌ సంస్థల్లో చరాస్తులు తప్ప నగదు లేదు. వెంటనే వాటిని విభజించాలి.
  • షీలాభిడే కమిటీ సిఫార్సుల మేరకు 40 తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థలను విభజించాలి. మిగిలిన సంస్థల సత్వర విభజనకు చర్యలు చేపట్టాలి. 
  • నలుగురు ఏపీ అధికారులను స్వరాష్ట్రానికి రప్పించడం, 13 మంది తెలంగాణ అధికారులను వారి రాష్ట్రానికి పంపించాలి.
  • పన్ను బకాయిలు, చెల్లింపులను కేంద్రం నిర్దేశించిన మార్గంలో చెల్లించడం, రాష్ట్ర ప్రాచీన పత్ర భాండాగారంలోని రికార్డులు, పత్రాల విభజన, ఆర్కియాలజీ విభాగం, మ్యూజియం విభజన. 
తెలంగాణ వాదన.. 
  • హెడ్‌క్వార్టర్స్‌ ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన ఒప్పందం జరగాలి. ప్రధాన కేంద్రంలోని భూములను కార్పొరేషన్ల ఆస్తిగా పరిగణించరాదు. ప్రధాన కేంద్రం ఉన్న ప్రాంత రాష్ట్రానికే నిర్ణయాధికారం ఇవ్వాలి. ఆస్తుల విలువను పక్కాగా లెక్కగట్టాలి.
  • ఏపీలో పనిచేసే తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఉపాధ్యాయలు, అధ్యాపకుల పరస్పర బదిలీలు. ప్రభుత్వ రంగ సంస్థ శాఖల్లోని నిధుల విభజన. కార్మిక రుసుముల విభజన.
  • సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాల విద్యుత్‌, నీటి బిల్లుల  చెల్లింపులు, ఏపీపీఎస్సీ విభజన, టీఎస్‌పీఎస్సీకి అదనంగా గదుల కేటాయింపు.
  • కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన రూ.1621 కోట్లలో విదేశీ రుణ చెల్లింపుల కోసం ప్రత్యేకించిన రూ.478.68 కోట్లలో తెలంగాణ వాటా నిధులు విడుదల చేయాలి.
  • బాలామృతం పథకం కింద ఏపీకి రూ.98.02 కోట్ల ఆహార ఉత్పత్తులను తెలంగాణ పంపిణీ చేసింది. వాటి బకాయిలు ఇప్పటికీ రాలేదు.
  • ఉమ్మడి ఆబ్కారీ శాఖ నుంచి రూ.135.98 కోట్ల తెలంగాణ వాటా రావాలి. పన్నుల వాటా కింద రావాల్సిన రూ.100 కోట్లను, ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బాండ్ల కోసం ఏపీకి తెలంగాణ ప్రభుత్వం అదనంగా చెల్లించిన రూ.141.69 కోట్లను వాపసు చేయాలి.
  • గ్రామీణ నీటి సరఫరా పథకాలకు సంబంధించిన ప్రపంచ బ్యాంకు రుణాల చెల్లింపుకు కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.19.01 కోట్లతోపాటు ఉమ్మడి రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ విభజన తర్వాత ఏపీ నుంచి తెలంగాణకు రూ.73.62 కోట్లు రావాలి. ఉమ్మడి మార్క్‌ఫెడ్‌ నుంచి రూ.13.50 కోట్లు అందాలి.
  • సచివాలయ, శాసనసభ భవనాలను తెలంగాణకు అప్పగించడంతోపాటు ఇంటెలిజెన్స్‌ పోలీసుల విభజన జరగాలి

views: 827

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams