Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం
మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని 2018 మే 7న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ప్రధాన కూడళ్ల నుంచి ప్రారంభమైన ర్యాలీల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, జేసీ, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆడబిడ్డపై అత్యాచారాలను ఖండిస్తూ, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభల్లో ఆడ బిడ్డకు రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వరకు (2.5కి.మీ దూరం) నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. పలువురు మహిళలు సీఎం వెంట కలిసి నడిచారు.
  • అత్యాచార ఘటనల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
  • చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ర్యాలీలు, సభలు నిర్వహించలేదు.
  •  ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం చేపట్టడంపై బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.

views: 868Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams