విదేశాల్లోని భారతీయ పిల్లలకు న్యాయానికి రాజేష్ బిందాల్ కమిటీ సిఫార్సులు
తల్లిదండ్రుల వివాదాల కారణంగా విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న భారతీయ పిల్లలకు తగిన న్యాయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
పిల్లల అపహరణపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం (హేగ్ కన్వెన్షన్ ఆన్ ద సివిల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ చైల్డ్ అబ్డక్షన్-1980)పై భారత దేశం కూడా సంతకం చేసినందున అందులో పొందుపరిచిన అంశాలను ఆచరణలో పెట్టడంపై సూచనలు ఇచ్చేందుకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రాధికారిక సంస్థను (ఇంటర్ కంట్రీ పేరంటల్ చైల్డ్ రిమూవల్ డిస్ప్యూట్స్ రెస్యోషన్ అథారిటీ) ఏర్పాటు చేయాలని సూచించింది.
కనీసం అయిదేళ్లపాటు సేవలందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ దీన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
విదేశాలకు వెళ్లే భారతీయులందరి మొత్తం సమాచారాన్ని ఈ ప్రాధికార సంస్థ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సమాచారంలో ఎలాంటి మార్పులు వచ్చినా వాటిని సంబంధిత దేశంలోని భారతీయ రాయబార కార్యాలయంలో నమోదు చేసే నిబంధన విధించాలి. ఇందుకోసం ఆన్లైన్ వేదికను రూపొందించాలి.
పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం భారతీయ రాయబార కార్యాలయాలను సంప్రదించేలా అవగాహన కల్పించాలి. మొదట తల్లిదండ్రుల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
సుశిక్షితులైన మధ్యవర్తుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. తల్లిదండ్రులు వేర్వేరు దేశాల్లో ఉన్నప్పుడు ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఏదైనా వివాదంతో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లలతో కలిసి భారత్కు వచ్చినప్పుడు వెంటనే వారు అథారిటీ దగ్గరకు వెళ్లేలా చూడాలని పేర్కొంది. విచారణలన్నీ పూర్తి గోప్యంగా ఉంచాలని సూచించింది.