Current Affairs Telugu Daily

బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు 
తనను తాను అవతార పురుషుడుగా చెప్పుకొంటూ ఆధ్యాత్మిక గురుగా ప్రసిద్ధి చెందిన ఆశారాం బాపు(77)ను అత్యాచారం కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం 2018 ఏప్రిల్‌ 25న దోషిగా తేల్చింది. 16 సం॥ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అతనికి జీవితఖైదు విధించింది. అతను మరణించేంత వరకూ జైలులోనే ఉండాలంటూ భారత శిక్షాస్మృతి, బాలల న్యాయచట్టంలోని వివిధ సెక్షన్ల కింద తీర్పు చెప్పింది. లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
  • ప్రస్తుతం ఆశారాం ఉంటున్న.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుండే జోధ్‌పుర్‌ కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక న్యాయమూర్తి మధుసూదన్‌ శర్మ తీర్పును వెలువరించారు.
  • ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శిల్పి, శరద్‌లకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ప్రకాశ్‌, శివ అనే ఇద్దరిని విడుదల చేసింది. 
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌కు చెందిన ఓ బాలిక మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడాలో ఉన్న ఆశ్రమంలో చదువుకునేది. ఆమె కుటుంబం ఆశారాంను ఎంతగానో విశ్వసించేది.
  • 2013 ఆగస్టు 15 రాత్రి జోధ్‌పుర్‌ సమీపంలోని మనాయి ప్రాంతంలో ఉన్న ఆశ్రమానికి తనను పిలిచి ఆశారాం అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆ బాలిక ఫిర్యాదు చేసింది.
  • సెప్టెంబరు 1న ఇండోర్‌లో ఆశారాం బాపూను పోలీసులు అరెస్టు చేసి జోధ్‌పుర్‌కు తరలించారు. మరుసటి రోజు నుంచే అతన్ని జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచారు. నవంబరు 6న వివిధ సెక్షన్ల కింద ఆశారాం, మరో నలుగురిపై పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ అనంతరం కేసును జోధ్‌పుర్‌ ఎస్సీ/ఎస్టీ కేసు న్యాయస్థానానికి బదిలీ చేశారు. 
  • వందల సంఖ్యలో ఆశ్రమాలు, రూ. వేల కోట్లలో ఆస్తులు, అధిక సంఖ్యలో అనుచరులు ఉన్న ఆశారాంకు శిక్ష పడిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహా సంబంధిత అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాయి.
  • 2018 ఆగస్టులో డేరాబాబాకు శిక్ష పడిన సందర్భంగా పంజాబ్‌, హర్యానాల్లో హింస చెలరేగడంతో ఈసారి ఆశారాం అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా పోలీసులు ఆశ్రమం చుట్టూ ముందే భద్రత ఏర్పాట్లు చేశారు. జోధ్‌పుర్‌లో నిషేధాజ్ఞలు విధించారు. ఆశారాం అనుచరులు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. 

views: 782



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams