Current Affairs Telugu Daily

నెట్‌బ్యాంకింగ్‌తోనూ భూమార్పిడి
ఆన్‌లైన్‌లో నెట్‌ బ్యాంకింగ్‌ విధానం ద్వారా భూ మార్పిడి సౌకర్యాన్ని పొందే అవకాశాన్ని శుక్రవారం నుంచి రెవెన్యూ శాఖ కల్పించింది. ఇందులోభాగంగా మీసేవ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవాలి. కొత్తగా రిజిస్టర్‌ అయిన వారు, ఇంతకుముందే లాగిన్‌ అయిన వారు ‘లిస్ట్‌ ఆఫ్‌ సర్వీసెస్‌’పైన క్లిక్‌ చేసి, భూమి మార్పిడి సేవను ఎంపిక చేసుకోవాలి. భూమి వివరాల(లావాదేవి వివరాలు, దరఖాస్తు నెంబరు, పేరు, చెల్లించాల్సిన రుసుము, జిల్లా, మండలం, గ్రామం, తదితర)ను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా బేసిక్‌ మార్కెట్‌  మొత్తాన్ని, మార్పు చేయాల్సిన భూమి విస్తీర్ణం వివరాలు నమోదు చేసిన వెంటనే ఎంత చెల్లించాలన్నది కనపడుతుంది. దాని ప్రకారం నిశిత పరిశీలన చేసుకుని సంతకం చేయాలి. ఆ సంతకం లేకుంటే భూ మార్పిడి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అన్ని పత్రాలను సరి చూసుకుని దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. మీసేవ ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా నిర్ణీత చలానా, మీసేవ యూజర్‌ మొత్తాన్ని కట్టేసి, డిమాండ్‌ స్లిప్‌(చలానా), రసీదు, ఇంటిమేషన్‌ ఆఫ్‌ పేమెంట్‌ స్లిప్‌ను పొందొచ్చు. ఈ ప్రక్రియ జరిగితే భూమార్పిడి జరిగినట్లే. ప్రస్తుతానికి నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పించారు. త్వరలో డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా రుసుముల చెల్లింపు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

ట్రెజరీలో రుసుము చెల్లించి... గత ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన మరో విధానంలో కూడా భూ మార్పిడి చేయించుకోవచ్చు. ఈ విధానంలో  భాగంగా ట్రెజరీలో రుసుము చెల్లించి... ఈ వివరాలతో మీసేవలో కేటగిరి-ఎ కింద దరఖాస్తు చేస్తున్నారు. 15 నిమిషాల్లో వచ్చే రసీదు ఆధారంగా భూమార్పిడి జరిగినట్లు నిర్థరించుకోవచ్చు.


views: 916



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams