Current Affairs Telugu Daily

అంటార్కిటికాలో  దోసపంట 
మంచుఖండం అంటార్కిటికాలోని ఓ ప్రయోగశాలలో తొలిసారిగా దోసకాయలు, ముల్లంగితోపాటు ఆకుకూరలనూ పరిశోధకులు పండించారు. ఇవి మన తోటలో పెంచినంత రుచికరంగా ఉండటం విశేషం...! అంతరిక్షంలోనూ ఆహార మొక్కల సేద్యం లక్ష్యానికి ఈ పరిశోధన ఊపిరిలూదింది. చంద్రుడు, అంగారకుడు లాంటి సుదూర అంతరిక్ష యాత్రలకు వెళ్లేవారికి తాజా ఆహారం పంపడం సాధ్యపడదు. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఆహార మొక్కలను పండించాలని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే జర్మనీ అంతరిక్ష కేంద్రం (డీఎల్‌ఆర్‌) నిపుణులు తాజా పరిశోధన చేపట్టారు. అంటార్కిటికాలో జర్మనీ పరిశోధన కేంద్రం న్యూమేయెర్‌ స్టేషన్‌-3 పరిసరాల్లో ‘‘ఈడెన్‌ ఐఎస్‌ఎస్‌’’ పేరిట ప్రత్యేక హరిత గృహాన్ని వారు నిర్మించారు. ఇది నౌకల్లో సరకులను తరలించే భారీ కంటెయినర్‌ పరిమాణంలో ఉంది. వ్యోమగాముల కోసం ఆహార మొక్కలను పండించే అత్యుత్తమ విధానాలను పరీక్షించే సదుపాయాలను దీనిలో ఏర్పాటుచేశారు. ఇక్కడ మట్టి లేదు. సహజ సూర్యకాంతి లేదు. పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధంలేని విధంగా ఈ హరిత గృహాన్ని తీర్చిదిద్దారు. దీనిలో నీరు, కాంతి, కార్బన్‌డైఆక్సైడ్‌ స్థాయిలను అధునాతన పరిజ్ఞానం సాయంతో నియంత్రించారు. మొదట దశలో 70 ముల్లంగి దుంపలు, 18 దోసకాయలు, 3.6 కేజీల ఆకుకూరలను పండించినట్లు న్యూమేయెర్‌ స్టేషన్‌-3 నిర్వాహకుడు బెర్నార్డ్‌ గ్రోప్‌ తెలిపారు. టమాటా, తులసి సహా మరికొన్ని మొక్కలనూ పెంచుతున్నట్లు వివరించారు. వచ్చే నెలనాటికి ఈ హరిత గృహం పూర్తి స్థాయి వినియోగంలోకి వస్తుందని, అప్పుడు వారానికి ఐదు కేజీల తాజా కూరగాయల దిగుబడిని సాధిస్తామని పేర్కొన్నారు.
views: 882

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams