Current Affairs Telugu Daily

పర్యావరణవేత్త శివాజీరావు మృతి
ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త ప్రొఫెసర్‌ టి.శివాజీరావు(86) 2018 మార్చి 31న విశాఖపట్నంలో మృతిచెందారు. 1932 జనవరి 2న జన్మించిన ఈయన 1956లో బెంగళూరులోని ఎం.విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. టెక్సాస్‌లోని రైస్‌ విశ్వవిద్యాలయంలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగంలో ఎం.ఎస్‌. చదివారు.
  • నాగార్జునసాగర్‌ నీటి సరఫరా విభాగంలో రెండేళ్లపాటు పనిచేసిన శివాజీరావు.. 1958లో ఆంధ్ర విశ్వవిద్యాలయ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బోధకుడిగా చేరారు. తర్వాత సివిల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌లో ఆచార్యులుగా పనిచేసి కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీవిరమణ చేశారు.
  • పర్యావరణ, కాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పరిశ్రమలు, నీటిపారుదల, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో నిపుణుల కమిటీ సభ్యుడిగా సేవలందించారు.
  • పర్యావరణ సంరక్షణ, కాలుష్య నివారణకు నివేదికలు తయారుచేసి హైకోర్టు, సుప్రీంకోర్టుకు సమర్పించారు.
  • తాజ్‌మహల్‌ పరిరక్షణకు 1975లో శివాజీరావు తలపెట్టిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
  • విశాఖలో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి పరిస్థితి వివరించగా, తాజ్‌మహల్‌ పరిరక్షణకు ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారు.
  • 2004 నుంచి 2009 వరకు వాతావరణ శాఖ డి.జి. కోటేశ్వరం సారథ్యంలో అప్పటి వాతావరణ నిపుణులు జె.వి.ఎం.నాయుడుతో పాటు శివాజీరావు మేఘమథనంపై ప్రయోగాలు చేసి విజయవంతం చేయటంలో కీలకపాత్ర పోషించారు.
  • విశాఖ పోర్టు ట్రస్టు కాలుష్య నియంత్రణ విభాగం ఛైర్మన్‌గా విశేష కృషిచేశారు.
  • ఓజోన్‌ పొర క్షీణత వల్ల పర్యావరణానికి, మానవ మనుగడకు వాటిల్లే ముప్పుపై శివాజీరావు సమర్పించిన సమగ్ర నివేదికను అనేక దేశాలు పరిగణనలోకి తీసుకున్నాయి.
  • పర్యావరణ అంశాలపై 85 పుస్తకాలు, వ్యాసాలు రాశారు.
  • ప్రస్తుతం గీతం విశ్వవిద్యాలయంలో సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

views: 1008

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams