Current Affairs Telugu Daily

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు 
తెలంగాణ శాసనసభ 2018 మార్చి 13న ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసింది. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు సహా 11 మందిని, శాసనమండలిలో విపక్ష నేత సహా ఆరుగురు సభ్యులను బడ్జెట్‌ సమావేశాల వరకు సస్పెండ్‌ చేస్తూ శాసనసభ, మండలిలో నిర్ణయం తీసుకున్నారు.
శాసనసభలో..
 • నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని, కాంగ్రెస్‌ పక్ష నేత జానారెడ్డితోపాటు 11 మంది ఎమ్మెల్యేలను ప్రస్తుత సమావేశాలుపూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి సభ ఆమోదంతో సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌ విధింపును కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన నడుమ ప్రకటించారు.
 • గవర్నర్‌ నరసింహన్ ప్రసంగం సందర్భంగా 2018 మార్చి 12న ఉభయ సభల సంయుక్త సమావేశంలో చోటు చేసుకున్న సంఘటనలపై మార్చి 13న సభ ప్రారంభం కాగానే సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ శాసనసభలో ఎన్నడూ లేని అవాంఛనీయ సంఘటన జరిగిందని, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్  గాయపడటం తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందన్నారు. కాంగ్రెస్‌ దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు.
 • అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దాడి సంఘటనను ప్రస్తావిస్తూ అమానవీయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్‌ వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. దాడి హేయమైన చర్యగా పేర్కొంటూ సభ సంప్రదాయాలను వెల్లడించారు. సభా కార్యకలాపాల నిబంధనల ప్రకారం (వరస సంఖ్య 2/340) నిబంధనల్ని వివరించారు. పార్లమెంటులో పాటిస్తున్న  నిబంధనలు, పు చర్యలను ఉదహరించారు.
 • రాజ్యాంగం ప్రకారం సభా వ్యవహారాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తే తీసుకోవాల్సిన కఠినమైన చర్యల (సభా వ్యవహారాలు 122 పేజీ, 7.1 పేరా) ప్రకారం నిర్ణయం తీసుకునే హక్కు సభాపతిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం సభలో తీవ్రమైన దాడి, సభా వ్యవహారాలను అవమాన పర్చడం, ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన కాంగ్రెస్‌ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ పేర్లను వెల్లడించారు.
 • వారి శాసనసభ సభ్యత్వాల రద్దుకు ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభాపతి అంగీకారం తెలపగా సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
 • ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు మార్చి 13న సభా మర్యాదకు విరుద్ధంగా వ్యవహరించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై సస్పెన్షన్‌ విధించాలంటూ తీర్మానం చేశారు. దీనికి సభాపతి అంగీకారం తెలపగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
 • దీంతో సభలో ప్రతిపక్ష నేత (సీఎల్పీ నాయకుడు) జానారెడ్డి సహా 10 మంది సభ్యులపై సమావేశాలు ముగిసే వరకు వేటు పడింది. 
శాసన మండలి లో..
 • 2018 మార్చి 13న శాసనమండలి సమావేశం ప్రారంభం కాగానే డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ మాట్లాడుతూ జరిగిన ఘటన, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ గాయపడటం బాధాకరమని అన్నారు.
 • ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీతో పాటు ఐదుగురు సభ్యులపై బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు తీర్మానం ప్రవేశపెట్టారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ దీనికి ఆమోదం తెలిపారు. 
శాసనసభలో సభ్యత్వం రద్దయిన కాంగ్రెస్‌ సభ్యులు
 1. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి                             నల్గొండ
 2. ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌                             ఆలంపూర్ 
శాసనసభలో సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ సభ్యులు
 1. కుందూరు జానారెడ్డి (సీఎల్పీ నేత)         నాగార్జునసాగర్‌
 2. తాటిపర్తి జీవన్‌రెడ్డి                                   జగిత్యాల
 3. నలమంద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి                 హుజూర్‌నగర్‌
 4. జెట్టి గీతారెడ్డి                                             జహీరాబాద్‌
 5. జిల్లెల చిన్నారెడ్డి                                     వనపర్తి
 6. డీ.కే. అరుణ                                             గద్వాల
 7. మల్లు భట్టివిక్రమార్క                               మధిర
 8. తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి                  పరిగి
 9. చల్ల  వంశీచంద్‌రెడ్డి                                కల్వకుర్తి
 10. దొంతి మాధవరెడ్డి                                    నర్సంపేట
 11. నలమంద పద్మావతిరెడ్డి                         కోదాడ
శాసనమండలిలో సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ సభ్యులు
 1. షబ్బీర్‌అలీ (మండలిలో ప్రతిపక్ష నేత)
 2. పొంగులేటి సుధాకర్‌రెడ్డి
 3. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
 4. దామోదర్‌రెడ్డి
 5. సంతోష్‌కుమార్‌
 6. ఆకుల లలిత
 • సభ్యత్వం రద్దయిన కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌లు 2018 మార్చి 13 సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు ‘కేసీఆర్‌ హటావో....తెలంగాణ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షను చేపట్టారు. 
 • కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ (ఆలంపూర్‌) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ శాసనసభ సచివాయం 2018 మార్చి 13 రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇద్దరు సభ్యుల శాసన సభ్యత్వాల రద్దు దృష్ట్యా రెండు స్థానాలు ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ డిల్లీలోని కేంద్ర ఎన్నిక సంఘానికి(ఈసీ) ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం పంపింది. 
 • రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇంతటి తీవ్ర చర్యలు తీసుకున్న దాఖలాలు  లేవు.
 • ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయటం దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ప్రథమం.
 • సభను సజావుగా నిర్వహించేందుకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం స్పీకర్‌కు ఆర్టికల్‌ 194(3) ద్వారా ఉంటుంది.
 • సమావేశాల సందర్భంగా సభ్యులను సస్పెండ్‌ చేయడమనేది సాధారణం. కానీ,  సభ్యత్వాన్ని రద్దు చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న దాఖలాలు లేవు.
 • గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హర్యానా శాసనసభల్లో పలువురు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిన ఉదంతాలున్నాయి. పార్లమెంటులో కూడా పలువురు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. 
 • 2012 జులై 18న మధ్యప్రదేశ్‌ శాసనసభను నడిపిస్తున్న ఎమ్మెల్యే జ్ఞాన్‌సింగ్‌పై అప్పటి కాంగ్రెస్‌ సభ్యులు చౌధరి రాకేశ్‌సింగ్‌ చతుర్వేది, కల్పనా పారులేకర్‌లుఅనుచితంగా ప్రవర్తించారు. పోడియం వద్దకు దూసుకుపోయి గలాటా సృష్టించారు. జ్ఞాన్‌సింగ్‌ను కుర్చీలోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. దీంతో స్పీకర్‌ ఈశ్వర్‌దాస్‌ రోహిణి ఆ తర్వాత వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేశారు.
 • 2015 ఆగస్ట్‌ 3న అనుచిత ప్రవర్తన ఆరోపణలపై ముగ్గురు తృణమూల్‌ ఎమ్మెల్యేలు లుఖోయ్‌, బిషోర్జిత్‌, జాయ్‌క్రిష్ణ పదవులను మణిపూర్‌ శాసనసభ ట్రైబ్యునల్‌ కోర్టు రద్దు చేసింది. అయితే, ఆ తర్వాత లుఖోయ్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభ ప్రకటన జారీ చేసింది.

views: 1112Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams