Current Affairs Telugu Daily

జీఎస్టీ బిల్లులకి లోక్‌సభ ఆమోదం 
జీఎస్టీ (Goods and Service Tax)కి సంబంధించిన 4 అనుబంధ బిల్లులకు మార్చి 29న లోక్‌సభ ఆమోదం తెలిపింది. 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సెంట్రల్ జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ) -2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ)-2017, యూనియన్ టెరిటరీ జీఎస్టీ బిల్లు (యూటీజీఎస్టీ)-2017, జీఎస్టీ పరిహార బిల్లు (రాష్ట్రాలకు)-2017లను లోక్‌సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో కూడిన సమగ్ర విశ్లేషణ మీకోసం... 
జీఎస్టీ అంటే... 
దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ అమలు కోసం, పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో జీఎస్‌టీ లేదా వ్యాట్ అమలవుతోంది. అమలు విషయానికొస్తే ఒక వస్తువు వినియోగదారుడిని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్‌సేల్, రిటైల్ ఇలా పలు దశలుంటాయి. సేవల విషయంలోనూ అంతే. ప్రతి దశలోనూ కొంత విలువ జోడిస్తారు. అందువల్ల ఈ దశలన్నింటిలో పన్ను వసూలవుతుంది. కొన్నిసార్లు పన్నుపై పన్ను వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో ఈ పన్నులన్నీ రద్దయి ఒకే పన్ను అమలవుతుంది. కేంద్ర ఎకై ్సజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ స్థానంలో.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఒక్కటే ఉంటుంది. ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ వర్తిస్తుంది. 
సీజీఎస్టీ బిల్లు
వస్తువులు, సేవల అంతర్రాష్ట్ర సరఫరాలపై కేంద్రం విధించే సీజీఎస్టీ- జమ్మూ, కాశ్మీర్ మినహా మొత్తం దేశానికి వర్తిస్తుంది.
షెడ్యూల్ 1 రెడ్‌విత్ 7 ప్రకారం, ఒక ఏడాదిలో ఒక యజమాని ఒక ఉద్యోగికి రూ.50,000లోపు ఇచ్చే బహుమతి వస్తు, సేవల సరఫరాగా పరిగణించరాదు.
షెడ్యూల్ 3 ప్రకారం, కొన్ని కార్యకలాపాలను వస్తు, సేవలుగా పరిగణించరాదు. ఇందులో లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లిగ్ మినహా ఇతర ఆర్థిక క్లెయిమ్‌లు ఉన్నాయి. దేశంలో విదేశీ దౌత్య బృందం సేవలూ ఇదే కోవకు వస్తాయి. భవన నిర్మాణం, భూ అమ్మకాలు ఈ పరిధిలో ఉన్నాయి.
ఆల్కాహాలిక్ లిక్కర్ సరఫరాల మినహా ఇతర అంతర్రాష్ట్ర వస్తుసేవల సరఫరాలకు సీజీఎస్టీ వర్తిస్తుంది.
సీజీఎస్టీ రేట్ పరిమితిని 14 శాతం నుంచి 20 శాతానికి పెంపు.
జీఎస్టీ మండలి సిఫారసులపై ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి పెట్రోలియం క్రూడ్, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ), పెట్రోల్, నేచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)ల సరఫరాలపై సీజీఎస్టీ అమలవుతుంది.
జీఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌తో ఎటువంటి సంబంధం లేకుండా, వస్తు, సేవలకు సంబంధించి సమగ్రమైన రికార్డులను ట్రాన్‌‌స పోర్టర్ కలిగి ఉండాలి. వార్షిక రిటర్న్స్ సమర్పించిన తేదీ నుంచి 72 నెలల లోపు అకౌంట్, రికార్డ్ పుస్తకాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించడానికి గడువు ఇంతకుముందు 60 నెలలుగా ఉండేది.

ఐజీఎస్టీ బిల్లు...
జీఎస్‌టీలోని ప్రధాన మూడు భాగాల్లో (సీజీఎస్‌టీ, ఐటీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ) ఇంటిగ్రేటెడ్ వస్తు, సేవల పన్ను ఒకటి. ఒకదేశం-ఒకే పన్ను భావనకు ఇదే మూలం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వస్తు, సేవల రవాణా సందర్భంలో ఐజీఎస్‌టీని కేంద్రం వసూలు చేస్తుంది. అధికారులు స్థిరీకరించిన రేట్ల ప్రకారం, ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్రాలు పంచుకుంటాయి. ఇది కూడా సీఎస్‌ఎస్‌టీ తరహాలోనే జమ్మూకాశ్మీర్‌కు కాకుండా మొత్తం దేశానికి వర్తిస్తుంది. పరిమితిని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఆల్కాహాలిక్ లిక్కర్‌పై ఐజీఎస్‌టీ ఉండదు. 

యూటీజీఎస్టీ బిల్లు
యూటీజీఎస్‌టీ(కేంద్ర పాలిత ప్రాంతం జీఎస్టీ)... కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువులు, సేవలపై పన్ను వసూళ్లకు యూటీజీఎస్టీ నిబంధనలు వర్తిస్తాయి. అసెంబ్లీలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే యూటీజీఎస్టీ అమలవుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరిలకు అసెంబ్లీలు ఉన్నందుకు ఆ రెండూ చోట్ల మాత్రం ఎస్‌జీఎస్‌టీ అమలవుతుంది. రాష్ట్రాలకు ఎస్‌జీఎస్టీ అమలవుతున్నందుకు కేంద్ర పాలిత ప్రాంతాల కోసం అతి తక్కువ సమయంలో యూటీజీఎస్టీని రూపొందించారు. ఎస్‌జీఎస్టీలోని నిబంధనలే దాదాపుగా యూటీజీఎస్టీలో పొందుపర్చారు. 

రాష్ట్రాలకు పరిహార బిల్లు
జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఏర్పడే నష్టం భర్తీ కోసం పరిహార చట్టాన్ని రూపొందించారు. నష్టాల భర్తీ కోసం రాష్ట్రాలకు మొదటి సంవత్సరం రూ. 50 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ. 26 వేల కోట్లను క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్సుగా వసూలు చేస్తారు. ఇక మిగతా రూ. 24 వేల కోట్లను పొగాకు, విలాసవంతమైన కార్లు, పాన్ మసాల, కొన్ని శీతల పానీయాలపై అదనపు పన్ను ద్వారా సేకరిస్తారు. జీఎస్టీ అమలు తేదీ నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తారు. రెండు నెలలకోసారి రాష్ట్రాలకు చెల్లింపులు చేస్తారు. ఐదేళ్ల అనంతరం పరిహార నిధిలో మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అనుబంధ బిల్లులకి లోక్‌సభ ఆమోదం 
ఎప్పుడు : మార్చి 29
ఎందుకు : దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం కోసం

views: 1002

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams