Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు 
ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2018 ఫిబ్రవరి 28న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
  • మానవ అక్రమ రవాణా (నివారణ, పరిరక్షణ, పునరావాసం) బిల్లు-2018’కు ఆమోదం. మానవ అక్రమ రవాణా కేసుల్ని ఇకపై ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) విచారిస్తుంది. దీనికి వీలుగా ఎన్‌ఐఏ చట్టాన్ని సవరించడంతో పాటు ఆ సంస్థలో ఒక విభాగాన్ని ప్రత్యేకంగా నెలకోల్పడానికి నిర్భయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. ఇలాంటి నేరాలను పదేపదే చేసేవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. దీనికి వీలుగా నేరాలను ‘రవాణా’, ‘తీవ్రమైన రవాణా’ అనే విభాగాలుగా వర్గీకరించారు. మొదటిదానికి 7 నుంచి 10 ఏళ్లు, రెండో దానికి కనీసం పదేళ్ల నుంచి యావజ్జీవం వరకు శిక్ష విధించవచ్చు. బలవంతంగా పనుల్లోకి దించడం, దానికోసం మాదక ద్రవ్యాలు వాడడం, వెట్టిచాకిరీ, బలవంతపు అద్దెగర్భం, వ్యభిచార వృత్తిలోకి దించడానికి అనువుగా పిల్లలు  త్వరగా పెద్దవాళ్లుగా కనిపించేలా హార్మోన్లు ఎక్కించడం, రసాయనాలు ఉపయోగించడం, బాల్య వివాహాలు, పెళ్లి ముసుగులో అక్రమ రవాణా, ఆ పేరుతో గర్భవతిని చేయడం, లేదా తీవ్ర అనారోగ్యం  పాల్జేయడం వంటివి తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అక్రమ రవాణాకు సహకరించేవారికి మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. పునరావాస నిధిని, మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ స్థాయిలో పునరావాస కమిటీని ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదిత చట్టంలో ఒక సిఫార్సు. బాధితులు, వారికి సహాయపడే సాక్షుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. వారు ప్రతిసారీ పోలీసు ఠాణాకు, కోర్టుకు తిరగాల్సిన అవసరం ఉండదు.
  • కేసు విచారణకు నిర్దిష్టగడువు విధిస్తారు. బాధితుల అక్రమ రవాణా గురించి తెలిసిన ఏడాదిలోగా వారిని తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకుంటారు. 
  • కేసు విచారణ పూర్తయ్యేంతవరకూ వేచిచూడకుండా బాధితులకు తక్షణం సహాయ, పునరావాసం కల్పిస్తారు. నెలలోగా మధ్యంతర సాయం, అభియోగపత్రం దాఖలు చేసిన 60 రోజుల్లోగా పూర్తిస్థాయిలో సహాయం అందిస్తారు. 
  • నిందితులకు శిక్షపడినా, పడకపోయినా బాధితులకు సాయం చేస్తారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు ఇస్తున్న పలు రకాల భత్యాలను పెంచడానికి ఆమోదం. నియోజకవర్గ భత్యం రూ.45,000 నుంచి రూ.60,000కి, ఫర్నీచర్‌ భత్యం కింద ఒకేసారి ఇచ్చే మొత్తాన్ని రూ.75,000 నుంచి రూ.లక్షకు పెరుగుతుంది. రూ.50,000 మూల వేతనంతో కలిపి ఒక్కో ఎంపీకి ప్రస్తుతం నెలకు రూ.2.75 లక్షలు లభిస్తోంది.
  • నాఫెడ్‌కు బ్యాంకు అందించే క్రెడిట్‌ గ్యారెంటీ రూ.9,500 కోట్ల నుంచి రూ.19వేల కోట్లకు పెంపు. 
  • ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని రూ.5500 కోట్లతో 12వ పంచవర్ష ప్రణాళిక తర్వాత మరో మూడేళ్లు కొనసాగించడానికి సమ్మతి. 
  • 12 కీలక సేవారంగాలు తమ శక్తిమేరకు విస్తరించేందుకు వీలుగా చేయూత. ఇందులో ఐటీ, ఐటీఆధారిత సేవలు, పర్యాటకం, ఆతిథ్యం, వైద్య పర్యాటకం తదితర సేవలున్నాయి. వీటి అభ్యున్నతికోసం చేపట్టే కార్యాచరణకోసం రూ.5వేల కోట్లతో ప్రత్యేకనిధి ఏర్పాటు.

views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams