Current Affairs Telugu Daily

స్వలింగ సంపర్కం తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీంకోర్టు నిర్ణయం
- పరస్పర ఆమోదంతో ఇద్దరు వయోజనులు స్వలింగ సంపర్కానికి పాల్పడడాన్ని నేరంగా పరిగణించరాదని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 
- తద్వారా ఇది నేరమేనంటూ 2013లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించనుంది. 
- ప్రకృతి నియమాలకు విరుద్ధంగా స్త్రీ, పురుషుడు, లేదా జంతువులతో అసహజ లైంగిక చర్యకు ఉపక్రమించేవారికి జైలుశిక్ష, జరిమానా విధించాలని పేర్కొంటున్న ఐపీసీ 377 సెక్షన్‌ను విస్తృత ధర్మాసనం పరిశీలించడమే సబబని అభిప్రాయపడింది. 
- ఈ సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని నవ్‌తేజ్‌సింగ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. 
- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం 2018 జనవరి 8న దీనిని విచారించింది. - పరస్పర ఆమోదంతో అసహజ లైంగిక చర్యకు పాల్పడినవారిని జైల్లో పెట్టడం తగదనీ, లైంగిక భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కేనంటూ ఇటీవల తొమ్మండుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం కూడా పేర్కొందనీ సింగ్‌ తరఫు న్యాయవాది అరవింద్‌ దటార్‌ గుర్తుచేశారు. 
- సామాజిక నైతికత అనేది కాలంతో పాటు ఎప్పటికప్పుడు మారుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013 నాటి తీర్పును సవరించాల్సిందిగా కోరుతూ దాఖలైన విజ్ఞాపన ప్రస్తుతం అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వద్ద ఉందనీ, తాజా పిటిషన్‌నూ అదే ధర్మాసనం విచారిస్తుందనీ తెలిపింది. 
- స్వలింగ సంపర్కం శిక్షార్హమా కాదా అనే తుది నిర్ణయం అక్కడే వెలువడుతుందని పేర్కొంది. 
- జంతువులతో, పిల్లలతో లైంగిక చర్యల విషయాన్ని మాత్రం విస్తృత ధర్మాసనానికి నివేదించడం లేదని స్పష్టం చేసింది.
- ఐపీసీ సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 
- 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. 
- ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్‌ ఫౌండేషన్‌ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 
- పిటిషన్‌ను విచారించిన డిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. 
- రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణాల్ని 377 సెక్షన్‌ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. 
- ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్నివెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది.
- 2013 డిసెంబర్‌ 11న డిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం కాదంది. 
- అనంతరం తీర్పును సమీక్షించాని కేంద్ర ప్రభుత్వం, గే హక్కు కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 
- అనంతరం పలువురు క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడంతో 2016 ఫిబ్రవరి 2న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది.  
- దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి.   

views: 1119

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams