భూవాతావరణంలో కూలనున్న చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-1
చైనా తొలి అంతరిక్ష ప్రయోగశాల తియాంగాంగ్-1 కొద్దినెలల్లో భూ వాతావరణంలో కూలిపోనుంది. అయితే దీనిపై ఆందోళన వద్దని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. వాటి శకలాలు ఒక మనిషిని తాకే ప్రమాదం చాలా తక్కువని చెబుతున్నారు.
- తియాంగాంగ్-1 అనే ఈ రోదసి ప్రయోగశాలను 2011లో రోదసిలోకి పంపారు.
- రెండేళ్ల పాటు సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. మరిన్ని ప్రయోగాలు నిర్వహించడం కోసం దీని జీవితకాలాన్ని రెండున్నరేళ్లకు పెంచారు.
- 2016 నుంచి ఈ ప్రయోగశాల క్రమంగా భూ వాతావరణంలోకి జారిపోతోంది.
- ఇది 2018 మార్చి మధ్యలో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ కార్పొరేషన్ సంస్థ పేర్కొంది.
- వాతావరణ రాపిడి కారణంగా ఇది మండిపోతుంది.
- అయితే కొన్ని భాగాలు నేల మీద పడే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో పడతాయన్నది ఇప్పుడే ఊహించడం కష్టమైనప్పటికీ.. తియాంగాంగ్-1 వాలు వంటి వివరాల ఆధారంగా అది 43 డిగ్రీల ఉత్తర, 43 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య ప్రదేశంలో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఏరోస్పేస్ సంస్థ వివరించింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా సముద్రం ఉందని పేర్కొంది.
- ఉపగ్రహాలు, వ్యోమనౌకలు భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం సర్వసాధారణమే అయినప్పటికీ వాటి వల్ల భూమిపై మానవులు గాయపడటం కానీ ఆస్తి నష్టం జరగడం కానీ చాలా అసాధారణం.
- 1997లో అమెరికాలోని ఓక్లహామాలో రాష్ట్రంలోని టుస్లాలో వ్యాహ్యాళికి వెళుతున్న లోటీ విలియమ్స్ అనే మహిళ భుజంపై 6 అంగుళాల పొడవున్న ఒక లోహపు వస్తువు పడిరది. దీనివల్ల ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.
- ఆ శకలం పడిన సమయం, ప్రదేశాన్ని పరిశీలించిన అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అది డెల్టా రాకెట్‌కు సంబంధించిన రెండో దశలోని ఒక భాగమని నిర్ధరించింది. అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌లో దీని ప్రధాన శకలాన్ని గుర్తించింది.
- రోదసి పరిశోధనల చరిత్రలో లోటీ విలియమ్స్ మినహా అంతరిక్ష వ్యర్థం మరెవరినీ తాకలేదు.
- ఇప్పటివరకూ భూవాతావరణంలోకి ప్రవేశించిన అతిపెద్ద మానవనిర్మిత వస్తువు రష్యాకు చెందిన మిర్ అంతరిక్ష కేంద్రం. దీని శకలాలు న్యూజిలాండ్‌కు తూర్పున పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. ఈ అంతరిక్ష కేంద్రం బరువు 1.2 లక్షల కిలోలు. తియాంగాంగ్-1 బరువు 8,500 కిలోలు.
views: 1144