Current Affairs Telugu Daily

2జీ స్పెక్ట్రమ్‌ కేసు నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ కోర్టు తీర్పు
సంచలనాత్మక 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె అయిన కనిమొళి సహా మొత్తం నిందితులందరినీ డిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2017 డిసెంబర్‌ 21న నిర్దోషులుగా ప్రకటించింది. 2జీ కేసులో ఆరోపణను రుజువు చేయడంలో సీబీఐ దారుణంగా విఫలమయిందని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఒ.పి.సైనీ స్పష్టం చేశారు. కొంత మంది వ్యక్తులు తెలివిగా కొన్ని అంశాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని వాటిని అల్లి లేని కుంభకోణాన్ని సృష్టించారని ఆక్షేపించారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు దర్యాప్తు చేసిన మూడు వేరువేరు కేసుల్లో ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లపాటు క్రమం తప్పకుండా విచారణ జరిపినా.. సరైన ఆధారాలను తన ముందు ప్రవేశపెట్టడంలో సీబీఐ విఫలమైందని జడ్జి పేర్కొన్నారు.రాజకీయవేత్తలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నతాధికారులు కలిసి కుట్రపన్ని భారీ ఎత్తున లబ్ధి పొందారని పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో అత్యంత వివాదాస్పదమైన అవినీతి కేసుల్లో ఒకటిగా ఈ కేసు నిలిచింది. 2014 సాధారణ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం దారుణ ఓటమికి ప్రధాన కారణాల్లో ఈ కేసు కూడా ఒకటి.
- 2జీ కుంభకోణంలో తలెత్తే కేసుల విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 మార్చి 14న ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. మొత్తం 3 కేసులపై న్యాయస్థానం 2017 డిసెంబర్‌ 21న నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మూడు కేసుల్లోనూ కలిపి వివిధ కంపెనీలు సహా మొత్తం 35 మంది నిందితున్నారు.
- స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘2జీ స్పెక్ట్రమ్‌’ అవకతవకలు దేశాన్ని కుదిపేశాయి. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌కు ప్రమేయమున్న వాటర్‌గేట్‌ కుంభకోణం తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన అతిపెద్ద అధికార దుర్వినియోగం ఇదేనని ‘టైమ్‌’ మేగజైన్‌ అప్పట్లో పేర్కొంది. 
- విద్యుదయస్కాంత తరంగాల్లో ఒక శ్రేణిని స్పెక్ట్రమ్‌గా పేర్కొంటారు. ఇవి నిజానికి రేడియో తరంగాలు. సెల్‌ఫోన్‌ వంటి సాధనాకు సమాచార బట్వాడా కోసం వాహకంగా వీటిని వాడుకుంటారు. ఇది పరిమిత ప్రకృతి వనరులు. దీనికి నిర్దిష్ట పౌనఃపున్యాలు ఉంటాయి.
- 2007 మే: టెలికాం మంత్రిగా రాజా బాధ్యతల స్వీకరణ 
ఆగస్టు: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల ప్రక్రియ ప్రారంభం 
నవంబరు: పారదర్శకత పాటించాలని రాజాకు అప్పటి ప్రధాని లేఖ
- 2008 జనవరి: ‘‘మొదట వచ్చేవారికే.. తొలి ప్రాధాన్యం’’ విధానంలో కేటాయింపులు చేస్తామని ప్రకటన 
సెప్టెంబరు, నవంబరు: స్వాన్‌ టెలికాం, యునీటెక్‌, టాటా టెలీసర్వీసెస్‌ తమ వాటాలు భారీ ధరకు ఎటిసలాట్‌, టెలినార్‌, యునీటెక్‌కు అమ్మకాలు.
- 2009 మే: స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకు జరిగాయంటూ ఆరోపణలు. విచారణ చేపట్టాలని సీబీఐకి సీవీసీ ఆదేశాలు
అక్టోబరు: కొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ 
నవంబరు: కేటాయింపు విధానాలను కార్పొరేట్‌ సంస్థలు ప్రభావితంచేసినట్లు పైరవీకారిణి నీరా రాడియా, రాజా సంభాషణ ఆధారంగా ఆదాయపు పన్ను విభాగం వెల్లడి
- 2010 మార్చి: కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని కాగ్‌ నివేదిక 
సెప్టెంబరు: రూ.70,000 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై పది రోజుల్లో ప్రత్యుత్తరం ఇవ్వాలని కేంద్రం, రాజాకు సుప్రీం ఆదేశాలు 
నవంబరు: రూ.1.76 లక్ష కోట్లు నష్టం సంభవించిందని కాగ్‌ నివేదిక, రాజా రాజీనామా
- 2011 ఫిబ్రవరి: రాజా అరెస్టు 
ఏప్రిల్‌: రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి, మాజీ టెలికాం కార్యదర్శి సిద్ధార్థ్‌ బెహురా సహా పలువురు కార్పొరేట్‌ అధికారులు నిందితులుగా సీబీఐ అభియోగపత్రం 
డిసెంబరు: ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్లు అన్షుమాన్‌, రవి రూయాబీ లూప్‌ టెలికాం ప్రమోటర్లు కిరణ్‌ ఖైతాన్‌, ఆమె భర్త పీ ఖైతాన్‌ సహా పలువురిపై మరో అభియోగపత్రం
- 2012 ఫిబ్రవరి: రాజా హయాంలో జారీచేసిన 122 కేటాయింపుల రద్దు
- 2013 డిసెంబరు: 2జీ వ్యవహారంపై లోక్‌సభకు సంయుక్త పార్లమెంటరీ సంఘం నివేదిక
- 2017 ఏప్రిల్‌: విచారణ పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు 
డిసెంబరు: అభియోగాలు రుజువుకాకపోవడంతో రాజా, కనిమొళి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు 
- 2జీ కుంభకోణం కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి : జస్టిస్‌ ఓపీ సైనీ

views: 904

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams