Current Affairs Telugu Daily

భారత్‌కు 'మిస్‌ వరల్డ్‌'
ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి(మిస్‌ వర్డల్‌) కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్‌ వశమైంది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్‌ ఇండియా’ మానుషి ఛిల్లర్‌.. మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో శనివారం రాత్రి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన 67వ మిస్‌ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్‌  ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది.  2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్‌ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది.  హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణురాలు కావాలనుకుంటున్న ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లో సేవా దృక్పథంతో పనిచేసే ఆస్పత్రుల్ని నిర్వహించడం జీవిత లక్ష్యమని మిస్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

views: 2238



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams