Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు 
ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన 2017 నవంబర్‌ 16న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. 
- వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనాలను వినియోగదారులకు పంచకుండా సొమ్ముచేసుకుంటున్న వ్యాపారుల భరతం పట్టడానికి అనుచిత లాభ నిరోధక ప్రాధికార సంస్థ(యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ) ఏర్పాటు చేయాలని నిర్ణయం. 178 వస్తువులను 28% పన్ను పరిధి నుంచి తప్పించి 18% లోపునకు చేర్చిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడటానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కార్యదర్శి స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు. పన్నురేట్లకు విరుద్ధంగా వ్యాపారులు వసూలు చేసినా, పన్ను తగ్గిన తర్వాతా ధరలు తగ్గించకపోయినా దీనికి ఫిర్యాదు చేయవచ్చు. ఈ సంస్థ కింద ఒక స్థాయీ సంఘం, ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటవుతాయి. పన్ను ప్రయోజనాలను వ్యాపారి తనకు కల్పించడంలేదని భావించే వినియోగదారులు రాష్ట్రాల పరిధిలోని సారథ్య సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అంశాలేమైనా ఉంటే నేరుగా స్థాయీ సంఘంలో ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ ఫిర్యాదుల్లో సాక్ష్యాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలితే దానిపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సేఫ్‌గార్డ్స్‌తో విచారణ జరిపిస్తారు. దాని ఆధారంగా ధరలు తగ్గించమనో, అక్రమంగా దండుకున్న లాభాలను వినియోగదారులకు వడ్డీతో సహా చెల్లించమనో ‘అనుచిత లాభ నిరోధక ప్రాధికార సంస్థ’ ఆదేశిస్తుంది. చేయిదాటిన పరిస్థితుల్లో మోసం చేసిన వ్యాపారులపై జరిమానా విధించడం కానీ, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడం కానీ చేస్తుంది. 
- అన్ని రకాల పప్పుదినుసుల ఎగుమతిపై నిషేధం ఎత్తేస్తూ కేంద్ర కేబినెట్‌ వ్యవహారాల ఆర్థిక సంఘం నిర్ణయం తీసుకొంది. దీనివల్ల రైతు తమకు నచ్చిన మార్కెట్‌లో సరుకులను విక్రయించుకోవడానికి వీలవుతుంది. 
- 2017 ఏప్రిల్‌ 1తో ముగిసిపోయిన సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని (ఐసీడీఎస్‌ను) 2018 నవంబర్‌ వరకూ కొనసాగించాలని  నిర్ణయం
- పాఠశాలలు మానేసిన 11-14 ఏళ్లలోపు బాలికల కోసం పథకాలను దశలవారీగా విస్తరణకు ఆమోదం
- జాతీయ శిశుపాలన పథకం (నేషనల్‌ క్రెష్‌ స్కీం)ని కేంద్ర పథకం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకం జాబితా కిందికి చేర్చాలని  నిర్ణయం. ఇక మీదట దీనికయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే అమలుచేయాల్సి ఉంటుంది. 
- న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని 2020 మార్చి 31 వరకు కొనసాగించాలని  నిర్ణయం
- పట్టణాల్లో పెద్ద ఇళ్లు నిర్మించుకున్నా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మధ్య తరగతి ప్రజలకు వడ్డీ రాయితీ వర్తింపజేయాలని  నిర్ణయం. రూ.6 లక్షలు-రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారిని ఎంఐజీ-1 కింద, రూ.12లక్షలు-రూ.18లక్షల ఆదాయం ఉన్నవారిని ఎంఐజీ-2 కింద పరిగణిస్తున్నారు. రూ.9 లక్షల రుణం వరకు ఎంఐజీ-1 వారికి 4%, రూ.12 లక్షల రుణం వరకు ఎంఐజీ-2 వారికి 3% వడ్డీ రాయితీ ఇస్తారు. ఎంఐజీ-1 కింద నిర్మించే ఇళ్ల గరిష్ట విస్తీర్ణ పరిమితిని 90 చదరపు మీటర్ల నుంచి 120 చ.మీ. వరకు పెంచారు. ఎంఐజీ-2 ఇళ్లకు పరిమితిని 110 చ.మీ. నుంచి 150 చ.మీ.కి పెంచారు. ఇది 1.1.2017 నుంచే అమల్లోకి వస్తుంది. 

views: 1186Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams