Current Affairs Telugu Daily

ర్యాగింగ్‌ నియంత్రణకు యూజీసీ నూతన ప్రమాణాలు 
ర్యాగింగ్‌ నియంత్రణ కోసం దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ అంశంపై నలుగురు సభ్యులతో యూజీసీ అధ్యయనం చేయించింది. సంబంధిత నివేదికను ఆమోదిస్తూ దీనిలోని సిఫార్సులన్నీ తప్పనిసరిగా అమలుచేయాలని 2017 నవంబర్‌ 14న ఉత్తర్వులు జారీ చేసింది. 
సిఫార్సుల్లో ప్రధాన అంశాలు..
- అన్ని విద్యాసంస్థలూ విద్యాసంవత్సరం ప్రారంభంలో కొత్త విద్యార్థుల కోసం స్వాగత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వీటిలో విద్యార్థులందర్నీ భాగస్వాముల్ని చేయాలి. క్యాంపస్‌లో ప్రవర్తనపై అప్పుడే స్పష్టమైన అవగాహన కల్పించాలి. ర్యాగింగ్‌, లైంగిక వేధింపులు, కుల, మత, జాతి వివక్షలను సహించబోమన్న సందేశాన్ని గట్టిగా పంపాలి.
- క్యాంపస్‌లో పూర్తిగా సీసీటీవీలు అమర్చాలి. వార్డెన్లు, అధ్యాపకులతో నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
- ర్యాగింగ్‌ కేసుల విచారణపై స్పష్టమైన ప్రామాణిక నిబంధనలు రూపొందించాలి. ఆ నిబంధన గురించి విద్యార్థులకు తెలియజేయాలి. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచాలి.
- ర్యాగింగ్‌ బాధితులు, బాధ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అధికారం, అసమానతలు, వివక్ష, బహిష్కరణ, వేధింపులు, హింస లాంటి అంశాలపై డ్రామా, ఆర్ట్‌, సినిమా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులను కౌన్సెలర్లు చైతన్యవంతుల్ని చేయాలి.
- ప్రజాస్వామ్య విలువలు, పరస్పరం గౌరవించుకోవడం, అహింస, స్వతంత్రత, విమర్శనాత్మక ఆలోచనలు, భిన్నత్వాన్ని గౌరవించడం, నిజాయితీగా ఉండటం లాంటి అంశాలను నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలి.
- గ్రామీణ, పట్టణ విద్యార్థుల మధ్య ఘర్షణ పరిస్థితుల నివారణ కోసం హాస్టల్‌ సీట్లను లాటరీ పద్ధతిలో కేటాయించాలి.
- ఈ చర్యల అమలును గుర్తింపు ఇచ్చే, గడువును పొడిగించే సమయంలో న్యాక్‌ తప్పనిసరిగా పర్యవేక్షించాలి.

views: 1226

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams