Current Affairs Telugu Daily

ఎక్స్‌రే పోలరైజేషన్‌ గుట్టు విప్పిన భారత ఆస్ట్రోశాట్‌ 
భారత తొలి అంతరిక్ష పరిశీలనశాల ఆస్ట్రోశాట్‌ అరుదైన ఘనత సాధించింది. అత్యంత సంక్లిష్టమైన ఎక్స్‌రే ధ్రువణం (పోలరైజేషన్‌) గుట్టును విప్పింది. శక్తిమంతమైన రేడియోధార్మికత, పల్సార్ల గురించి ప్రస్తుతమున్న సిద్ధాంతాలకు ఇది సవాళ్లు రువ్వుతోంది. ఒక భారీ నక్షత్రం పెను విస్ఫోటంతో పేలిపోవడంతో మిగిలిపోయిన అవశేషాలే పల్సార్‌గా రూపుదిద్దుకుంటాయి. టారస్‌ తారామండలంలోని 1054 సంవత్సరంలో పేలిపోయిన ఒక తారకు సంబంధించిన క్రాబ్‌ పల్సార్‌పై భారత ఖగోళశాస్త్రవేత్తల బృందం 18 నెలల పాటు పరిశోధనలు సాగించింది. వాటి ఫలితాలను ప్రముఖ ‘నేచర్‌ ఆస్ట్రోనమీ’ పత్రికలో ప్రచురించింది. ఇది ప్రతి సెకనుకు 30 సార్లు భ్రమణంలో ఉన్నప్పుడు దాని పోలరైజేషన్‌లో ఉన్న వ్కెరుద్ధ్యాలను మన శాస్త్రవేత్తలు లెక్కించగలిగారు. పల్సార్లు న్యూట్రాన్లతో తయారవుతాయని భావిస్తున్నారు. వాటి పరిమాణం చిన్నగానే ఉన్నప్పటికీ వాటిలో సూర్యుడిలో ఉన్నంత ద్రవ్యరాశి ఉంటుంది. భూమితో పోలిస్తే వీటి గురుత్వాకర్షణ, అయస్కాంత క్షేత్రాలు లక్షల కోట్లు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ పల్సార్ల నుంచి కాంతిని పోలిన తీవ్రమైన ఎక్స్‌రే రేడియోధార్మికత, విద్యుదయస్కాంత తరంగాలు వెలువడుతుంటాయి. వీటిని ఖగోళ శాస్త్రవేత్తలు విస్తృతంగా అధ్యయనం చేశారు. వాటి ద్వారా పల్సార్ల గురించి సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. అయితే ఎక్స్‌రే పోలరేజేషన్‌ అనే లక్షణం మాత్రం అంతుచిక్కకుండా ఉండిపోయింది. దీన్ని కొలవడం చాలా కష్టం. ఆస్ట్రోశాట్‌లోని క్యాడ్మియం జింక్‌ టెలూరైడ్‌ (సీజడ్‌టీ) ఇమేజర్‌ పరికరం.. క్రాబ్‌ పల్సార్‌కు సంబంధించిన ఎక్స్‌ రే పోలరైజేషన్‌పై అత్యంత సున్నితమైన లెక్కలు కట్టింది. దీనివల్ల తొలిసారిగా పల్సార్‌కు సంబంధించి వివిధ భ్రమణ దశల్లో పోలరైజేషన్‌ గురించి సవివరంగా అధ్యయనం చేయడానికి వీలైందని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. పల్సార్‌ నుంచి ఎలాంటి చర్యలకూ ఆస్కారం లేదని భావిస్తున్న ‘ఆఫ్‌ పల్స్‌’ సమయంలో పోలరైజేషన్‌లో తేడాలు చోటుచేసుకోవడాన్ని పరిశీలించారు. పల్సార్లు ఎక్స్‌రేలు ఎలా ఉత్పత్తి చేస్తాయన్న దానిపై ప్రస్తుతమున్న సిద్ధాంతాలను ఇది సవాల్‌ చేస్తోంది.
views: 1016



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams