Current Affairs Telugu Daily

 కృష్ణా సోబతీకి జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు
 దేశ అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు ప్రముఖ హిందీ రచయిత్రి కృష్ణా సోబతీని వరించింది. ఈమేరకు 2017 నవంబర్ ౩న నిర్వహించిన ఓ సమావేశంలో ఎంపిక సంఘం (సెలక్షన్‌ బోర్డ్‌) 2017 సంవత్సరానికి గాను 53వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారానికి ఆమె పేరును ప్రకటించింది. 1925లో గుజరాత్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ప్రాంతం)లో జన్మించిన సోబతీ నవ్య రచనా విధానాలతో ప్రయోగాలు చేయడంలో దిట్ట. తన కథల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సృజనాత్మక పాత్రలకు ఆమె జీవం పోస్తుంటారు. సోబతీ రచనలపై హిందీ, ఉర్దూ, పంజాబీ సంస్కృతుల ప్రభావం కనిపిస్తుంటుంది. భారత్‌-పాక్‌ విభజన, స్త్రీ-పురుషుల అనుబంధాలు, భారత సమాజ స్థితిగతులు, క్షీణిస్తున్న మానవ విలువలు వంటివే ఆమె కథాంశాలు. సోబతీ ప్రఖ్యాత రచనల్లో - దార్‌ సే బిచ్చుడీ, మిత్రో మర్జనీ, జిందగీనామా, దిలో దానిష్‌, బదలోమ్‌ కే ఘేరే, ఏ లడకీ, గుజరాత్‌ పాకిస్థాన్‌ సే గుజరాత్‌ హిందుస్థాన్‌ వంటివి ఉన్నాయి. ఆమె రచనల్లో కొన్ని ఇతర భారతీయ భాషలతో పాటు స్వీడిష్‌, రష్యన్‌, ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయ్యాయి. పద్మభూషణ్‌తో పాటు హిందీ అకాడమీ, శిరోమణ్‌ అవార్డులు.. మైథిలీ శరణ్‌ గుప్త సమ్మాన్‌, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌లు ఇప్పటికే ఆమెను వరించాయి. ‘‘కృష్ణా సోబతీ కొత్త ఒరవడి సృష్టించిన నవలా రచయిత. ఆమె హిందీ సాహిత్యాన్ని ఎంతగానో సుసంపన్నం చేశారు.’’ అని ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు నామ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని ఎంపిక సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. 
views: 1206

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams