Current Affairs Telugu Daily

రికార్డు స్థాయికి కార్బన్‌ డైఆక్సైడ్‌ పరిమాణం 
భూ వాతావరణంలో హానికరమైన కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఐరాస పేర్కొంది. లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి ఇది చేరిందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. పారిస్‌ వాతావరణ ఒప్పందం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడానికి గట్టి చర్యలు అవసరమని స్పష్టం చేసింది.
ఐరాసకు అనుబంధంగా ఉన్న ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)..‘గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ బులెటిన్‌’ పేరుతో ఏటేటా ఒక నివేదికను వెలువరిస్తుంటుంది. పారిశ్రామికీకరణ తర్వాత నుంచి (1750 నుంచి) వాతావరణంలో ప్రమాదకర వాయువుల పరిమాణాన్ని ఇది వెలుగులోకి తెస్తుంది. తాజాగా విడుదల చేసిన నివేదికలో 2016 సంబంధించిన గణాంకాలను వెలువరించింది. దీని ప్రకారం..
* ప్రపంచవ్యాప్తంగా 2016లో కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయు తీవ్రత 403.3 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం)కు చేరింది. 2015 అది 400 పీపీఎంగా ఉండేది.
* ఈ పెరుగుదలకు మానవ చర్యలతోపాటు బలమైన ఎల్‌ నినో వాతావరణ ప్రక్రియ కూడా కారణమైంది.
* భూమిపై చివరిసారిగా 30లక్షల నుంచి 50 లక్షల ఏళ్ల కిందట ఈ స్థాయిలో కార్బన్‌ డైఆక్సైడ్‌ పరిమాణం ఉండేది. నేటితో పోలిస్తే.. నాడు సముద్ర మట్టం 20 మీటర్ల మేర ఎక్కువగా ఉండేది.
తగ్గించుకోవాలి..: ‘‘కార్బన్‌ డైఆక్సైడ్‌, ఇతర గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను వేగంగా తగ్గించకుంటే ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతాయి. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో ఉద్గారాలకు కళ్లెం వేయాలి’’ అని డబ్ల్యూఎంవో అధిపతి పెటెరీ తాలస్‌ పేర్కొన్నారు. గణాంకాలు అబద్ధాలు చెప్పవని ఐరాస వాతావరణ అధికారి ఎరిక్‌ సొల్హెమ్‌ తెలిపారు. ‘‘చాలా ఎక్కువ పరిమాణంలో మనం ఉద్గారాలను వెలువరిస్తున్నాం. ఈ పరిస్థితిని మార్చాలి. దీనికి అంతర్జాతీయ రాజకీయ సంకల్పం అవసరం’’ అని పేర్కొన్నారు. 196 దేశాలు సంతకాలు పెట్టిన ఈ కీలక ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో కొత్త సవాళ్లు తలెత్తాయి. అయినా ఈ ఒప్పందాన్ని అమలు చేయడంపై వచ్చే వారం బాన్‌లో జరిగే వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి.

views: 2352

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams