Current Affairs Telugu Daily

కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ భూమి కేటాయింపునకు కేంద్రం అంగీకారం 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి బదిలీకి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అంగీకరించింది. దీనికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసే ప్రాంతంలో 50.69 లక్షల ఎత్తయిన మొక్కను నాటాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతమున్న అటవీ ప్రాంతంలోని చెట్లకు నిర్ణయించిన విలువను జమ చేయాలని కోరింది. ప్రత్యామ్నాయ అటవీ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టాలో చెప్పింది. ప్రత్యామ్నాయ భూమి ఇచ్చి, నిధులు జమ చేసిన తర్వాతే 8 జిల్లాల్లోని అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖకు లేఖ రాసింది.
- తెలంగాణ తాగునీటి సరఫరా పథకంలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోత పథకంలో కాలువలు, ఎత్తిపోతులు, సొరంగమార్గాలు, జలశయాల నిర్మాణం కోసం మహదేవపూర్‌, కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్‌, నిజామాబాద్‌, బాన్సువాడ, నిర్మల్‌ అటవీ డివిజన్లలో 3,168.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
- కేంద్ర ప్రభుత్వం నియమించిన అటవీ సలహా కమిటీ ఈ ప్రతిపాదనను పరిశీలించింది. రాష్ట్ర ప్రతిపాదన, అటవీ సలహా కమిటీ సిఫార్సును పరిశీలించిన తర్వాత 3168.13 హెక్టార్ల భూమిని మళ్లించడానికి మొదటి దశ (సూత్రప్రాయ) అనుమతి ఇస్తున్నట్లు లేఖలో తెలిపారు. రెండో దశ అనుమతికి కొన్ని షరతులు పెట్టారు.
- ప్రాజెక్టు కోసం మళ్లించే అటవీ భూమికి సంబంధించిన చట్టపరమైన హక్కు మారవు. ప్రస్తుతం ఇచ్చే భూమికి సమానంగా ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వడంతోపాటు రెండో దశ అనుమతిచ్చిన తర్వాత మూడేళ్లలో అక్కడ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకు అవసరమైన నిధులను నీటిపారుదల శాఖ ఇవ్వాలి. రాష్ట్ర అటవీ శాఖ సంప్రదింపులతో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఈ పని జరగాలి.
- ప్రత్యామ్నాయంగా కేటాయించిన భూమిని రాష్ట్ర అటవీశాఖ పేరుతో మ్యుటేషన్‌ చేయించాలి. ఇది రెండో దశ అనుమతి ఇవ్వక ముందే జరగాలి.
- ప్రత్యామ్నాయ అటవీభూమి అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన నిధులను జమ చేయాలి. మళ్లించే అటవీ భూమి నికర విలువ మొత్తాన్ని.. ప్రత్యామ్నాయ అటవీ నిధుల నిర్వహణ, ప్రణాళిక అథార్టీ (కంపా)కి జమ చేయాలి. నికర విలువ చెల్లించేటప్పుడు అదనంగా చెల్లించాల్సి వచ్చినా చెల్లిస్తామని నీటిపారుదల శాఖ అంగీకార పత్రం ఇవ్వాలి.
- ప్రతిపాదిత ప్రాంతం పర్యావరణంగా సున్నితమైన ప్రాంతంలో ఉన్నందున జాతీయ వన్యమృగ బోర్డు స్టాండింగ్‌ కమిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందాలి.
- ప్రత్యామ్నాయ అటవీ ప్రాంతంలో హెక్టారుకు కనీసం 1,600 ఎత్తయిన మొక్కను నాటాలి. ఇలా మొత్తం 50.69 లక్షల మొక్కలు నాటాలి. పదేళ్ల నిర్వహణ ఉండేలా చూడాలి. భూసార నిర్వహణకు 25 శాతం నిధులను జమ చేయాలి.
- వన్యమృగాలు తిరగడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి.
- జాతీయ హరిత ట్రైబ్యునల్‌, కోర్టుల్లో ఈ అంశంపై ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి.
- పునరావాస పథకాన్ని జాతీయ విధానం పరిధిలో రాష్ట్ర పునరావాస పథకం ప్రకారం అమలు చేయాలి.

views: 1183

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams