Current Affairs Telugu Daily

‘సౌభాగ్య’ పథకం మార్గదర్శకాలు జారీ 
ఇప్పటివరకూ దేశంలో విద్యుత్‌ సౌకర్యం లేని ఇళ్లన్నింటికీ కరెంటు కనెక్షన్‌ ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి సహజ్‌ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన’(సౌభాగ్య) పథకం మార్గదర్శకాలను కేంద్ర విద్యుత్‌ శాఖ జారీచేసింది. గత ఏప్రిల్‌ 30 నాటికి దేశంలో 4.59 కోట్ల ఇళ్లకు కరెంటు సౌకర్యం లేదని, వీటన్నింటికీ ఈ పథకం కింద వచ్చే ఏడాది(2018) డిసెంబరుకల్లా ఇవ్వాలని సూచించింది. తెలంగాణలో కరెంట్‌ సౌకర్యం లేని 10.48 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 155.07 లక్షలు, బీహార్‌ 67.37, మధ్యప్రదేశ్‌లో 45.85, ఒడిశాలో 38.42 లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. గోవా, గుజరాత్‌, తమిళనాడు, పంజాబ్‌, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో 100 శాతం ఇళ్లకు కరెంటు సౌకర్యం ఉన్నందున ఈ పథకం వర్తించదు. నిరుపేదలున్న ఇంటికి పూర్తి ఉచితంగా కనెక్షన్‌ ఇస్తారు. ఈ కోటాలోకి రానివారికి రూ.500కే ఇస్తారు. ఈ సొమ్ము కూడా వెంటనే తీసుకోరు. మొదటి నెల నుంచి 10వ నెల కరెంటు బిల్లు వరకూ ప్రతీ నెలా బిల్లులో రూ.50 చొప్పున తీసుకుంటారు. నిరుపేదల గుర్తింపునకు 14 అంశాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఇంట్లో పురుషులు లేకుండా... ఇంటి యజమానిగా వ్యవహరించే మహిళ వయసు 16 నుంచి 59 ఏళ్ల లోపు ఉంటే ఉచిత కనెక్షన్‌ ఇస్తారు. ఇంటిలో 25 ఏళ్లకు మించినవారిలో ఎవరూ అక్షరాస్యులు లేకున్నా ఉచితం వర్తిస్తుంది. ఈ పథక సమగ్ర ప్రాజెక్టు నివేదికను నవంబర్‌ 6లోగా అందజేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ను కేంద్రం ఆదేశించింది. 2018 డిసెంబరుకల్లా 100 శాతం కనెక్షన్లు ఇచ్చే రాష్ట్రానికి అదనపు నిధులిస్తామని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో 2019 మార్చికల్లా అన్నీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని సూచించింది. ఈ పథకం అమలుకు కేంద్రం రూ.16,320 కోట్లు ఖర్చు చేస్తుంది. ఒక్కో డిస్కం పెట్టే ఖర్చులో 60 శాతం కేంద్రం, 30 శాతం రాష్ట్రం భరించాలి. మిగతాది రుణంగా ఇస్తారు. జాతీయ గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) నిధులు సమకూరుస్తుంది.
వీటిలో ఏది ఉన్నా నిరుపేద కిందకు రారు 
1. మోటారు ఉన్న చేపల బోటు లేదా ద్విచక్ర వాహనం 
2. రిఫ్రిజిరేటర్‌ 
3. రూ.50 వేలకు మించిన రుణ సదుపాయం గల కిసాన్‌కార్డు 
4. త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వ్యవసాయ యంత్రం 
5. ప్రభుత్వ ఉద్యోగి 
6. ప్రభుత్వ వద్ద నమోదైన వ్యవసాయేతర సంస్థ 
7. నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయమున్న కుటుంబ సభ్యుడు 
8. ఆదాయపు పన్ను చెల్లింపుదారు 
9. వృత్తిపన్ను కట్టేవారు 
10. పక్కా గోడలు,పైకప్పుతో 3కన్నా ఎక్కువ గదులున్న ఇల్లు 
11. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ 
12. నీటి సదుపాయంతో 2.5 ఎకరాలకు మించి భూమి 
13. ఏడాదికి 2 లేదా 3 పంటు పండే 5 ఎకరాల భూమి 
14. కనీసం 7.5 ఎకరాల ఇతర భూమి

views: 944



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams