Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
రూ.7 లక్షల కోట్లతో జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక రంగానికి వూతమివ్వబోతోంది. దీంతోపాటు మొండి బకాయిలతో కుదేలవుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని వాటికి మూలధనంగా ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను 2017 అక్టోబర్‌ 24న ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్నారు. 
బ్యాంకులకు జవసత్వాలు 
- మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద వూరటనిచ్చే రీతిలో ప్రభుత్వం ఏకంగా రూ.2.11 లక్షల కోట్లను  రెండేళ్ల కాలంలో బ్యాంకులకు ఇవ్వనుంది. ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారిన నికర నిర్థక ఆస్తుల పరిష్కారానికి, బాసెల్‌-3 నిబంధనలను పాటించడానికి ఈ మూలధనం బాగా ఉపయోగపడనుంది. రూ.1.35 లక్షల కోట్లను బాండ్ల రీక్యాపిటలైజేషన్‌ ద్వారా, రూ.76,000 కోట్లను బడ్జెట్‌ మద్దతు ద్వారా పొందనున్నారు. 
‘ఇంద్రధనుష్‌’తో వెలుగులు 
- 2015 మార్చిలో నిరర్థక ఆస్తులు రూ.2.75 లక్షల కోట్లుగా ఉండగా.. 2017 జూన్‌ నాటికి అవి రూ.7.33 లక్షల కోట్లకు చేరాయి. 2015లో ప్రవేశపెట్టిన ఇంద్రధనుష్‌ ప్రణాళిక ప్రకారం బాసెల్‌-3 నిబంధనను పాటించడం కోసం నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.70,000 కోట్లను బ్యాంకుల్లోకి పంపుతుంది. 2015-16, 2016-17లో రూ.25,000 కోట్లు చొప్పున ఇచ్చింది. ఇక 2017-18, 2018-19లో రూ.10,000 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంది. 
హైవే పనుతో జంట ప్రయోజనాలు
- దేశంలో 83 వేల కి.మీ. మేర జాతీయ రహదారుల్ని అయిదేళ్లలో రూ.7 లక్షల కోట్ల వ్యయంతో అభివృద్ధి చెందించడానికి ఉద్దేశించిన బృహత్తర ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిలో భారీస్థాయి ‘భారత్‌మాల’ కూడా కలిపి ఉంది. ఈ ఒక్క పథకం ద్వారా 34 వేల కి.మీ. రహదారుల్ని రూ.5.35 లక్షల కోట్లతో 2022 నాటికి అభివృద్ధి చెందిస్తారు. భారత్‌మాల కింద తొలిదశలో 20 వేల కి.మీ. మేర పనుల్ని చేపడతారు. సరిహద్దుల వరకు అనుసంధానతను మెరుగుపరచడం, సరకు సత్వర రవాణాకు వీలుగా ఆర్థిక నడవాలను అభివృద్ధి చేయడం వంటి పనులు దీనిలో భాగంగా ఉన్నాయి. దాదాపు 21 వేల కి.మీ. మేర 44 ఆర్థిక నడవాలను, మరో 14 వేల కి.మీ. మేర అనుసంధాన రహదారులను, 1837 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో ముంబయి-కొచ్చి-కన్యాకుమారి, బెంగళూరు-మంగుళూరు, హైదరాబాద్‌-పనాజీ, సంబల్‌పూర్‌-రాంచీ తదితర మార్గాలున్నాయి. మొత్తం మీద అయిదేళ్లలో చేపట్టే పనుల ద్వారా 14.2 కోట్ల పని దినాలు లభించినట్లవుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం కింద గతంలో 50 వేల కి.మీ. హైవేలను మెరుగుపరిచారు. ఇప్పుడు రెండోసారి అత్యంత భారీ స్థాయి పనుల్ని చేపడుతున్నారు. సగం డబ్బును మార్కెట్‌ నుంచి, ప్రైవేటు పెట్టుబడు ద్వారా రాబడతారు. మిగిలిన సగాన్ని రహదారి బాండ్లు, సుంకాల ద్వారా సమీకరిస్తారు. 
పంటకు మద్దతు ధరులు పెంపు 
- గోధుమలు, పప్పుధాన్యాల పంటలకు మద్దతు ధరల్ని క్వింటాల్‌కు వరసగా రూ.110, రూ.200 చొప్పున పెంచాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ సంఘం నిర్ణయించింది. 2017-18 సంవత్సరానికి రబీ పంటలకు కనీస మద్దతు ధరల్ని ఆమోదించింది. ఉత్పాదకతను పెంచి, ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకొంది. నూనె గింజలకు మద్దతు ధరనీ గణనీయంగా పెంచారు.

views: 924



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams