అల్జీమర్స్, పార్కిన్సరీన్సీ, పక్షవాతం లాంటి నాడీ సంబంధిత రుగ్మతలతో సంభవిస్తున్న మరణాలు గత 25 ఏళ్లలో 36 శాతానికి పైగా పెరిగాయని తాజా అధ్యయనంలో తేలింది. రష్యాలోని నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నిపుణులు దీన్ని చేపట్టారు. 1900 నుంచి 2015 మధ్య సమాచారాన్ని వారు విశ్లేషించారు. ‘జీవితకాలం పెరగడమే నాడీ సంబంధిత రుగ్మతలకు ప్రధాన కారణం. విపరీతంగా పెరుగుతున్న జనాభా మరో కారణం’ అని పరిశోధనలో పాలుపంచుకున్న వసిలీ ల్లాసోవ్ తెలిపారు. ‘ఎక్కువ మరణాలకు పక్షవాతం, సాంక్రమిక నాడీ రుగ్మతలుకారణమవుతున్నాయి. సంపన్న దేశాల్లో సాంక్రమిక నాడీ రుగ్మతల స్థానాన్ని సాంక్రమికేతర నాడీ రుగ్మతలు భర్తీ చేస్తున్నాయి’ అని వివరించారు. అధ్యయనంలోని వివరాల ప్రకారం..
- 2015లో జీవిత కాలాన్ని భారీగా హరిస్తున్న వ్యాధుల(డీఏఎల్వై) జాబితాలో నాడీ రుగ్మతలదే అగ్రస్థానం. ప్రపంచ డీఏఎల్వైలో వీటి వాటా 10.2 శాతం. మరణాల్లో ఈ రుగ్మతది రెండో స్థానం. 16.8 శాతం మంది వీటివల్లే మరణిస్తున్నారు.
- ఎక్కువ మందిని పీడిస్తున్న నాడీ సంబంధిత రుగ్మతల జాబితాలో ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి (150 కోట్ల కేసు), పార్శ్వనొప్పి (100 కోట్ల కేసు), ఔషధాలు అతిగా ఉపయోగించడంతో వచ్చే తలనొప్పి (6 కోట్లు), అల్జీమర్స్ ఇతర మానసిక సమస్యలు (4.60 కోట్ల కేసు) ఉన్నాయి.
- పార్కిన్సన్స్ కేసుల్లో 15.7 శాతం పెరుగుదల కనిపించింది. అల్జీమర్స్ (2.4 శాతం), మెదడు, నాడీ సంబంధిత క్యాన్సర్లు(8.9 శాతం)లాంటి వ్యాధులు పెరిగాయి.
- అఫ్గానిస్థాన్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ రుగ్మతల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ క్షయ కేసుల్లో 280 మరణాలు సంభవిస్తున్నాయి.
views: 950