కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలను మెరుగుపరిచి, ఆశించిన లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా వాటిని హేతుబద్ధీకరించాని నీతి ఆయోగ్‌ నేతృత్వంలోని అధ్యయన బృందం పేర్కొంది. వివిధ ప్రత్యేక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఈ బృందం గుర్తించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచుతున్న నిధుల వినియోగం వల్ల కనిపిస్తున్న ప్రయోజనాలపై ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ’ అధ్యయనం చేసి నీతి ఆయోగ్‌కు నివేదిక సమర్పించింది. పథకాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ప్రతి పథకంతో బహుళ ప్రయోజనాలు ముడిపెట్టడం వల్ల వనరులు పలుచగా అందుబాటులో ఉంటున్నట్లు తెలిపింది. అన్ని రకాల పథకాల నుంచి దాదాపు ఒకే రకమైన ఫలితాలు రాబట్టాలని భావిస్తుండటం వల్ల దేనికీ పూర్తి స్థాయిలో నిధులు అందడంలేదని పేర్కొంది. సేవల లోపం అధికంగా ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు మంజూరు చేయాలన్న నిబంధన ఎక్కడా లేదని గుర్తు చేసింది. వివిధ పథకాలకు, వేర్వేరు రాష్ట్రాలకు ప్రాథమికంగా జరిపే కేటాయింపులకు, అంతిమంగా అందే నిధులకు చాలా తేడా ఉంటున్నట్లు పేర్కొంది. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలకు ఈ లోటు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. వైద్య ఆరోగ్య పథకాలకు వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఖర్చుకు అనుబంధంగా ఉపయోగిస్తుండటం వల్ల ఈ రంగానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులతో సమానంగా వ్యయం పెరగడంలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత హేతుబద్ధంగా మార్చడానికి తగిన చర్యులు తీసుకోవచ్చని పేర్కొంది. ప్రత్యేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసే నిధుల వినియోగం ఎలా ఉండాలో కేంద్రం తప్పనిసరిగా స్పష్టమైన విధి విధానాలు నిర్దేశించవచ్చని తెలిపింది. పథకాల సంఖ్యను పరిమితం చేసి, వాటికి తగినంత నిధులు ఇచ్చి ప్రజలకు అందే సేవ స్థాయిలో స్పష్టమైన మార్పు కనిపించేలా చేస్తే బాగుంటుందని పేర్కొంది.
views: 783

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams