Current Affairs Telugu Daily

నవజాత శిశు సంరక్షణలో తెలంగాణకు ద్వితీయ స్థానం 
నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ శిశు వైద్య ప్రమాణాల్లో 62% మార్కు సాధించి, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. నాణ్యమైన సేవలతో హర్యానా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటికే శిశు సంరక్షణలో పేరుగాంచిన తమిళనాడుకు సరిసమాన స్థానాన్ని తెలంగాణ పొందింది. ఆంధ్రప్రదేశ్‌ 57% మార్కు సాధించింది. 2017 అక్టోబర్‌ 10న న్యూఢిల్లీలో జరిగిన ‘నవజాత శిశు సంరక్షణ సదస్సు’లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఈ వివరాలను వెల్లడించింది. 7 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ మార్కును కేటాయించారు. 
7 అంశాలు... 
1. నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో (ఎస్‌ఎన్‌సీయూల్లో) 1,800 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో ఎంతమందికి చికిత్స అందించారన్నది పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంలో తెలంగాణకు అతి తక్కువగా 20% మార్కులొచ్చాయి. హర్యానా సహా మరే రాష్ట్రం 35% మార్కులను సాధించలేదు. అత్యధికంగా గోవాకు 33% మార్కులొచ్చాయి.
2. ఎస్‌ఎన్‌సీయూల్లో ఏడాదిలో ఎంతమంది శిశువుల్ని చేర్చుకున్నారు.. 24 గంటల్లో ఎంతమందిని ఇంటికి పంపారు.. రెండింటికీ మధ్య హేతుబద్ధత ఏవిధంగా ఉందన్నది లెక్కగట్టారు. ఈ అంశంలో జాతీయ సగటు 88%. తెలంగాణకు 69%, హర్యానా 90%, ఆంధ్రప్రదేశ్‌ 92% మార్కులు సాధించాయి.
3. ఎస్‌ఎన్‌సీయూల్లోని పడక సంఖ్య కంటే ఎక్కువగా వినియోగిస్తున్నారా? అనవసరంగా ఇంటికి పంపిస్తున్నారా? సగటున నెలకు ఎంతమంది శిశువుల్ని చేర్చుకుంటున్నారన్న అంశంలో- తెలంగాణకు 71%, ఉత్తరప్రదేశ్‌కు 98%, మహారాష్ట్రకు 96%, అసోం, హర్యానాకు 95%, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు 93% చొప్పున వచ్చాయి.
4. పుట్టుకతోనే ఆక్సిజన్‌ అందక శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నవారిలో ఎందరికి చికిత్స అందించారన్న విషయంలో- తెలంగాణ 87%, కేరళ 97%, పంజాబ్‌ 92%, తమిళనాడు 90% మార్కు తెచ్చుకున్నాయి.
5. నవజాత శిశువుకు హేతుబద్ధంగా యాంటీ బయాటిక్స్‌ను వినియోగించిన రాష్ట్రంగా చండీగఢ్‌ 95% మార్కుతో అగ్రస్థానంలో నివగా, తెలంగాణ 69% మార్కు సాధించింది.
6. బరువు తక్కువగా పుట్టిన శిశువుకు అందించిన చికిత్సల్లో సత్ఫలితాలు సాధించినవెన్ని... ఆహారం, పరిశుభ్రత, వెచ్చదనం తదితర అంశాల్లో ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయన్న విషయంలో- చండీగఢ్‌, గోవా, త్రిపుర రాష్ట్రాలు 100% ఫలితాలు సాధించాయి.  తెలంగాణకు 75% మార్కులొచ్చాయి.
7. 2,500 గ్రాముల కంటే ఎక్కువ బరువుతో పుట్టిన శిశువు ఎందరు మృతి చెందారు? వారికి అందించిన చికిత్సల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించారు? వంటి అంశాల్లో... త్రిపుర 100% మార్కు సాధించింది. తెలంగాణకు 82%, హర్యానాకు 87% మార్కులొచ్చాయి.
- మొత్తంగా 71-100% మార్కు సాధిస్తే ఉత్తమ ప్రతిభగా... 40-70% వస్తే సంతృప్తికర ప్రతిభగా... 40% కంటే తక్కువ వస్తే అసంతృప్తికర ప్రతిభ సాధించినట్లుగా కేంద్రం పేర్కొంది.
- అన్ని అంశాల్లో ఏ రాష్ట్రం కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చలేదు
- 40% కంటే తక్కువ మార్కుతో మేఘాలయ, నాగాలాండ్‌లు అసంతృప్తిగా నిలిచాయి.

views: 1045

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams