Current Affairs Telugu Daily

ఇండియాలో గూగుల్‌ మొబైల్‌ వాలెట్‌ తేజ్‌ ప్రారంభం
గూగుల్‌ డిజిటల్‌ చెల్లింపుల సేవల్లోకి అడుగు పెట్టింది. ‘తేజ్‌’ అనే పేరుతో గూగుల్‌ రూపొందించిన యాప్‌ను 2017 సెప్టెంబర్‌ 18న న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించారు. ఇది కేవలం భారత మార్కెట్‌ కోసమే తీసుకొచ్చిన యాప్‌ అని, ఎలక్ట్రానిక్‌ చెల్లింపులను మరింత భద్రంగా సులభంగా నిర్వహించడమే తేజ్‌ లక్ష్యమని గూగుల్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI) ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. యాప్‌లోకి బ్యాలన్స్‌ లోడ్‌ చేసుకునే అవసరం లేకుండా... నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు యాప్‌ ఓ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లోని క్యాష్‌ మోడ్‌ ద్వారా బ్యాంకు ఖాతా లేదా ఫోన్‌ నంబర్‌ వివరాలు అవసరం లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ టెక్నాలజీ సాయంతో తమ మొబైల్‌లోని మైక్రోఫోన్‌, స్పీకర్‌ సాయంతో లావాదేవీ పూర్తవుతుంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు సహా 7 భారతీయ భాషల్లో దీన్ని గూగుల్‌ తీసుకొచ్చింది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని యాక్టివేట్‌ చేసుకునే సమయంలోనే అందుబాటులో ఉన్న అన్ని భాషలు కనిపిస్తాయి. రూ.50కి పైన విలువ గల లావాదేవీలు చేసే వారికి రూ.1,000 వరకు విలువ గ ల స్క్రాచ్‌ కార్డులను ఇవ్వనుంది. తేజ్‌ సేవలకు గాను గూగుల్‌ యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న 50 బ్యాంకు కస్టమర్లు తేజ్‌ సేవలు వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. 
UPI-Unified Payment Interface

views: 770

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams