చంద్రయాన్-1 డేటాతో చంద్రుడిపై నీటి విస్తృతికి సంబంధించిన మ్యాప్
భారత్ తొలిసారి చంద్రుడి కక్ష్యలోకి పంపిన చంద్రయాన్-1 వ్యోమనౌక అందించిన డేటాతో చంద్రుడిపై నీటి విస్తృతికి సంబంధించిన మ్యాప్‌ను తొలిసారిగా శాస్త్రవేత్తలు తయారు చేశారు. భవిష్యత్‌లో చంద్రుడి పైకి వెళ్లే వ్యోమగాములకు ఇది ఉపయోగపడుతుంది. చంద్రుడిపై అన్వేషణకు చంద్రయాన్-1ను భారత్ 2008 అక్టోబర్ 21న ప్రయోగించింది. ఇందులో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు సంబంధించిన మూన్ మినరాలజీ మ్యాపర్ కూడా ఉంది. 2009లో చంద్రుడి ఉపరితలంపై నీటికి సంబంధించిన హైడ్రాక్సైల్ అణువులను తొలిసారిగా చంద్రయాన్-1 గురించింది. ఈ అణువులో ఒక్కొక్కటి చొప్పున హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మూన్ మినరాలజీ మ్యాపర్ అందించిన డేటాను ఉపయోగించుకొని చంద్రుడి ఉపరితలంపై ఎంత మేర నీరు ఉందన్నది లెక్కలు కట్టారు. భూమి మీదున్న అత్యంత పొడి ఎడారుల్లోని ఇసుకలో లభించే పరిమాణం కన్నా ఇది తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
views: 1037