Current Affairs Telugu Daily

తెలంగాణ సమాచార కమిషన్‌ ఏర్పాటు 
సమాచార హక్కు చట్టం-2005 కింద తెలంగాణ సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 13న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కమిషనర్‌, కమిషనర్ల ఎంపికకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ్యులుగా ఉంటారు. త్వరలోనే త్రిసభ్య కమిటీ సమావేశమై సభ్యులను ఎంపిక చేస్తుంది. రాష్ట్ర విభజన దృష్ట్యా ఉమ్మడి కమిషన్‌ విభజన జరిగింది. తెలంగాణకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటైంది. మొజాంజాహి మార్కెట్‌ వద్ద గల గృహ నిర్మాణ మండలి భవనంలో సమాచార కమిషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్రిసభ్య కమిటీ ఎంపిక చేసిన కమిషనర్ల జాబితాను గవర్నర్‌కు సిఫార్సు చేస్తే ఆయన నియామక ఉత్తర్వులులిస్తారు.
- రాష్ట్ర సమాచార కమిషన్‌లో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో 10 మంది కమిషనర్ల నియామకానికి అవకాశం ఉంది. 
- రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌కు ఎన్నికల కమిషనర్‌తో సమానమైన జీతభత్యాలు లభిస్తాయి. ఇతర సర్వీసు నిబంధనలు వర్తిస్తాయి. 
- కమిషనర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానమైన జీతభత్యాలుంటాయి. 
- 5 సం॥ పాటు లేదా 65 సం॥లు నిండే వరకు మాత్రమే ఈ పదవుల్లో ఉండాలి. ఇందులో పునర్నియామకాలకు వీల్లేదు. 
- అభియోగాలు వచ్చినా, అశక్తులని తేలినా తొలగింపు అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంటుంది. 
- ఆర్టీఐ నిబంధనల ప్రకారం.. ఈ పదవులకు ప్రజాజీవితంలో ప్రముఖులైన వారు, విజ్ఞానవంతులు, న్యాయశాస్త్రం, శాస్త్ర, సాంకేతిక, సామాజిక సేవ, యాజమాన్య నిర్వహణ, పరిపాలనలో మంచి అనుభవం ఉన్న వారినే నియమించాలి. 
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలతో సంబంధం గల వారు, లాభదాయకమైన పదవులను, వృత్తి, వ్యాపారాలు నిర్వహించేవారు ఈ పదవులకు అనర్హులు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కిరణ్‌కుమార్‌రెరెడ్డి ప్రభుత్వం చేపట్టిన నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్‌ 20న స్పష్టం చేసింది. 
- 2013 ఫిబ్రవరి 6న ఆర్టీఐ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్‌ అహ్మద్‌, తాంతియా కుమారి, విజయనిర్మల నియామకం చెల్లదంటూ పద్మనాభయ్య పద్మనాభరెడ్డి, రావు చెలికాని దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 
- 2013 ఫిబ్రవరి 6న వర్రె వెంకటేశ్వరు, తాంతియా కుమారి, ఇంతియాజ్‌ అహ్మద్‌, విజయనిర్మలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో నెం.75 జారీ చేసింది. 
- ఆ నియామకాల్ని సవాలు చేస్తూ సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. 
- 2013 సెప్టెంబరులో జీవో నెం.75ను రద్దుచేస్తూ ఆ నలుగురి నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది. 
- హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నలుగురు కమిషనర్లు సుప్రీంకోరును ఆశ్రయించగా 2013 ఆక్టోబరులో స్టే లభించింది. 
- 2017 ఏప్రిల్‌ 20న తుది విచారణలో వారి నియామకాలు చెల్లవని వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. దీంతో వారు పదవుల నుంచి తప్పుకున్నారు. 

views: 1219

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams