అర్జున పురస్కార గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖకు రూ.కోటితోపాటు 500 గజాల ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ 70 పతకాలను సాధించిన జ్యోతి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, ఆమె మున్ముందు మరింత రాణించేలా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. 2017 ఆగస్టు 31న సురేఖ, పలువురు క్రీడాకారులు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాయంలో చంద్రబాబును కలిశారు. దక్షిణభారతదేశంలో పిన్నవయసులో ఈ పురస్కారాన్ని పొందడంతోపాటు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచి తొలి అర్జున పురస్కార గ్రహీత కూడా సురేఖ కావడం అభినందనీయమన్నారు. ఒలింపిక్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించి విజయవాడ పేరును ప్రపంచస్థాయిలో నిలబెట్టాలనేదే తన ఆశయమని ఆమె ముఖ్యమంత్రికి తెలిపింది. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరచిన 10 మంది క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని క్రీడ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎం ఆదేశించారు.
views: 1153