Current Affairs Telugu Daily

పీఎస్‌ఎల్వీ- సీ39 ప్రయోగం విఫలం 
 శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి పూర్తిస్థాయి స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లి మూడు దశల్లో విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-39 సాంకేతిక లోపంతో నాలుగో దశలో విఫలమైంది. ఉష్ణకవచంలోనే శాటిలైట్‌ ఉండిపోయిందనీ, సమీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మెన్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ-సీ39 వాహక నౌక ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 హెచ్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ ప్రయోగం చేశారు.
నావిగేషన్‌ వ్యవస్థ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఇందులో 2013లో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహంలోని మూడు పరమాణు గడియారాలు మొరాయించి సేవలందడం లేదు. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ను పంపేందుకు ఉద్దేశించిన రాకెట్‌ ప్రయోగం విఫలమైంది.
అద్భుతంగా పనిచేస్తున్న ఆస్ట్రోశాట్‌: విశ్వంలోని మూలాలను శోధించేందుకు 2015 సెప్టెంబర్‌ 28న ప్రయోగించిన 1,513 కిలోల ఆస్ట్రోశాట్‌ అద్భుతంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)  ప్రకటించింది. ఇది ఖగోళంలో 360 రకాల పదార్థాలను పరిశోధించి సమాచారాన్ని అందించింది. ఖగోళ పరిశోధనకు ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ విశ్వంలోని గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల ఉన్న స్థితిగతులను తెలుసుకోవడానికి ఓ ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రతిపాదించారు.
దాన్ని 2015లో అమలు చేశారు. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి, నక్షత్రాల ఆవిర్భావం, న్యూట్రాన్‌ స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, గెలాక్సీ అవతలి పరిస్థితుల అధ్యయనానికి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 5 రకాల ఉపకరణాలు ఖగోళంలోని స్థితిగతులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నాయి.
ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రయోగాలలో , 40 విజయవంతం అవగా, కేవలం  2 విఫలం అయ్యాయి.

views: 1255

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams