Current Affairs Telugu Daily

జీపీఎస్‌ వ్యవస్థ నావిక్‌లో స్వదేశీకరణకు భారత్‌ ముందడుగు
సొంత జీపీఎస్‌ వ్యవస్థ (నావిక్‌)లో స్వదేశీకరణ దిశగా భారత్‌ 2017 ఆగస్టు 4న కీలక ముందడుగు వేసింది. నావిక్‌కు భారత పరమాణు గడియారాల ద్వారానే సమయం అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన ఇస్ట్రాక్‌ సెల్‌, ఢిల్లీలోని నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీ(NPL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇస్రోకు అత్యంత కచ్చితమైన సమయాన్ని ఎన్‌పీఎల్‌ అందిస్తుంది. ఇది అందించే భారత ప్రామాణిక సమయాని (IST)కి అనుగుణంగా ‘నావిక్‌’ సమన్వయమవుతుంది. ఎన్‌పీఎల్‌ అనేది శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(CSIR) ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. స్వాతంత్య్రానికి ముందే ఇది ఏర్పాటైంది. పరమాణు గడియారాల ద్వారా అత్యంత కచ్చితమైన భారత ప్రామాణిక సమయంని ఇది అందిస్తోంది. ఈ పరమాణు గడియారాలు ఫ్రాన్స్‌లోని అంతర్జాతీయ బ్యూరో ఆఫ్‌ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌తో సమన్వయమయ్యాయి. ఈ బీఐపీఎం ప్రపంచం మొత్తానికీ సార్వత్రిక సమన్విత సమయం(యూటీసీ)ను అందిస్తుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 పరమాణు గడియారాలు ఉన్నాయి. అందులో ఎన్‌పీఎల్‌కు చెందిన 5 గడియారాలు కూడా భాగమే. ఈ యంత్రాల్లో 10 కోట్ల సంవత్సరాలకు ఒక సెకను మేర మాత్రమే తేడా వస్తుంది. ఎన్‌పీఎల్‌ సమయంలో 20 నానో సెకన్ల మేర మాత్రమే వైరుద్ధ్యాలకు ఆస్కారం ఉంది.
నావిక్‌ వ్యవస్థలోని ఉపగ్రహాల్లో ఉన్న గడియారాల మధ్య సరైన సమన్వయం ద్వారానే ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థ కచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. భూమి మీద ఒక వ్యక్తి స్థితిని అత్యంత కచ్చితత్వంతో తెలుసుకోవడానికి కనీసం 4 ఉపగ్రహాలు అవసరం. ప్రస్తుతం ఇస్రో అమెరికాకు చెందిన జీపీఎస్‌పై ఆధారపడుతోంది. గల్ఫ్‌ యుద్ధం సమయంలో మధ్య ప్రాచ్య ప్రాంతంలో జీపీఎస్‌ సేవలను అమెరికా నిలిపివేసింది. మనకు అలాంటి సమస్య ఎదురుకాకుండా నివారించడానికి తాజా ఒప్పందం వీలు కల్పిస్తుంది. వాణిజ్య అవసరాల కోసం ‘నావిక్‌’ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి కూడా దోహదపడుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్టాక్‌ నిర్వహణ, డిజిటల్‌ ఆర్కైవింగ్‌, టైమ్‌ స్టాంపింగ్‌, అంతర్జాతీయ వాణిజ్యం, జాతీయ భద్రత, సైబర్‌ నేరాల నిరోధం వంటి అంశాలకు సమయ సమన్వయం చాలా అవసరం. వాతావరణ అంచనాలు కూడా కచ్చితమైన సమయ సమాచారం, దాని సమన్వయంపైనే ఆధారపడి ఉంటాయి. దిక్సూచీ, నిఘా కార్యక్రమాలకు నానోసెకన్ల స్థాయిలో కచ్చితత్వం అవసరం. అంతకుముందు దేశీయ జీపీఎస్‌ను విస్తృతంగా విరివిలోకి తెచ్చేందుకు చేపడుతున్న చర్యలను రాజ్యసభలో ప్రభుత్వం తెలియజేసింది. భారత పరిశ్రమల భాగస్వామ్యంతో దేశీయ రిసీవర్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ‘నావిక్‌’ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి ఒకటి రెండేళ్లు పడుతుందన్నారు.
NAVIC-Navigation Indian Constellation
ISRO-Indian Space Research Organisation
NPL-National Physical Laboratory
IST-India Standard Time
CSIR-Council of Scientific & Industrial Research

views: 1004

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams