Current Affairs Telugu Daily

జాతీయ రహదారుల పక్కన విశ్రాంతికి హైవే నెస్ట్, హైవే విలేజ్‌
దేశంలోని అన్ని జాతీయ రహదారుల పక్కన ప్రయాణికులు, డ్రైవర్ల కోసం ప్రతి 50 కి.మీ.కు ఒకటి చొప్పున సౌకర్య కేంద్రాలు అభివృద్ధి చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. కారు, బస్సు ప్రయాణికులతో పాటు భారీ వాహనాల డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు వీటిలో సదుపాయాలు కల్పించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ బాధ్యతను చూసుకుంటుంది. అమెరికా, జర్మనీ తరహాలో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 2017 ఆగస్టు 3న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కేంద్రాల్లో కార్లు, బస్సు, ట్రక్కు పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తారు. పెట్రోల్‌ బంకులు, వాహన మరమ్మతు కేంద్రాలు, విశ్రాంతి గదులు, డార్మిటరీలు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, దాబాలు, వ్యవసాయ, చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మూడు విభాగాలుగా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. తొలి విభాగంలో సాధారణ ప్రయాణికులు, భారీ వాహనాల డ్రైవర్ల అవసరాలకు తగినట్లుగా, రెండో విభాగంలో ప్రత్యేక తరగతి ప్రయాణికుల అవసరాలు తీర్చేలా సదుపాయాలు ఉంటాయి. మూడో విభాగాన్ని ట్రక్‌ డ్రైవర్లకు కేటాయిస్తారు. మొత్తం స్థలం లో 20 శాతంలోనే నిర్మాణాలు ఉంటాయి. మిగతా 80% పార్కింగ్‌, ఇతర వినోద సదుపాయాలకు కేటాయిస్తారు.
- 5 ఎకరాల లోపు స్థలంలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని ‘హైవే నెస్ట్‌’ అని, అంతకన్నా ఎక్కువ స్థలంలో నెలకొల్పే కేంద్రాన్ని ‘హైవే విలేజ్‌’ అని పిలుస్తారు.
- 5 ఎకరాలకు పైబడి స్థలం ఉన్న వ్యక్తులు సొంతంగా కూడా ఈ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ముందుకొచ్చే వారికి ప్రభుత్వమే జాతీయ రహదారుల అనుసంధానాన్ని కల్పిస్తుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చడంలో తోడ్పాటు అందిస్తుంది. పెట్రోలు బంకుల ఏర్పాటుకు అనుమతుల విషయంలో సహకరిస్తుంది.
- ప్రైవేటు భూముల్లో ఏర్పాటు చేసే కేంద్రాలపై ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమూ ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు 
కల్పించదు. కేవలం  వాటిని ఎన్‌హెచ్‌ఏఐ అధీకృత కేంద్రాలుగా ప్రకటిస్తుంది. అక్కడ అందించే సేవల నాణ్యతను పర్యవేక్షిస్తుంది.
- ఈ కేంద్రాల లేవుట్‌, ఆకృతి అంతా ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశించిన విధంగానే ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయ్యే 2 కేంద్రాలు
1. తిరుపతి-తిరుత్తని-చెన్నై సెక్షన్‌లో ఎన్‌హెచ్‌ 205పై, ఎస్‌వీపురం గ్రామం వద్ద (చిత్తూరు జిల్లా)
2. అనంతపురం-బెంగళూరు సెక్షన్‌లో రేగాటిపల్లి గ్రామం వద్ద (అనంతపురం జిల్లా).

views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams