Current Affairs Telugu Daily

ఇస్రో మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ యు.ఆర్‌.రావు మృతి
ఇస్రో మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉడుపి రామచంద్రరావు(యు.ఆర్‌.రావు) 2017 జులై 24న బెంగళూరులో మృతి చెందారు. శాస్త్ర పరిశోధనలకు పెట్టింది పేరైన 85 ఏళ్ల ప్రొఫెసర్‌ రావు ప్రస్తుతం అహ్మదాబాద్‌ భౌతికశాస్త్ర పరిశోధనాలయం, బెంగళూరు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్లానిటోరియం పాలకమండలి అధ్యక్షుడిగా, తిరువనంతపురంలోని భారత అంతరిక్ష విజ్ఞాన, సాంకేతిక సంస్థ(ఐఐఎస్‌టీ) ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా అదమారులో సాధారణ రైతు లక్ష్మినారాయణ ఆచార్య, కృష్ణవేణి దంపతులకు ఆచార్య యు.ఆర్‌.రావు జన్మించారు. డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయి నేతృత్వంలో కాస్మిక్‌ రే అధ్యయనకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన రావు 1975లో భారత తొలి అంతరిక్ష నౌక ఆర్యభట్ట తయారీలో కీలక పాత్ర పోషించారు. గ్రహాల మధ్య విద్యుదయస్కాంత ప్రభావంపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఉపగ్రహ, రాకెట్ల సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించారు. 1984 నుంచి 1992 వరకు భారత అంతరిక్ష విజ్ఞాన సంస్థ (ఇస్రో)కు అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆర్యభట్టతో పాటు భాస్కర, యాపిల్‌, రోహిణి, ఇన్‌శాట్‌-1, 2 శ్రేణులు, జీఎస్‌ఎల్‌వీ వంటి 18కిపైగా వినూత్న అంతరిక్ష పప్రయోగాల రూపక్పనలో కీలక పాత్ర పోషించారు. 1980-90 మధ్యకాలంలో ఆవిష్కృతమైన ఇన్‌శాట్‌ శ్రేణి ప్రయోగాలు ప్రస్తుత భారత సమాచార సాంకేతిక విప్లవానికి నాంది పలికాయి. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌తో సహా ఇస్రో చేపట్టిన అన్ని ప్రధాన ప్రయోగాలో ఆయన కీలకపాత్ర పోషించారు. భారత అంతరిక్ష రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 1976లో పద్మభూషణ్‌, 2017లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 2013లో ‘వాషింగ్టన్‌ శ్యాటిలైట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’, 2016లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఐఏఎఫ్‌) ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పురస్కారాలు లభించాయి. ఈ ఘనతలు సాధించిన తొలి భారతీయుడిగా యు.ఆర్‌.రావు ఘనత సాధించారు. 
views: 975

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams