Current Affairs Telugu Daily

UN ఎయిడ్స్‌ నివేదిక 
 దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే 2016 నాటికి బాధితుల సంఖ్య దాదాపు సగం మేర తగ్గినట్లు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక 2017 జూలై 20న వెల్లడించింది. కొత్త హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య, ఎయిడ్స్‌ మరణాలు తగ్గుముఖం పట్టాయి. చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి చికిత్స తీసుకుంటున్నారు. పారిస్‌లో ప్రారంభం కానున్న ఎయిడ్స్‌ సైన్స్‌ సదస్సుకు సంబంధించి ఈ వివరాలను ‘యూఎన్‌ ఎయిడ్స్‌’ ఒక నివేదికలో వెల్లడించింది.
- 2005-16 మధ్య ఎయిడ్స్‌ మరణాలు 19 లక్షల నుంచి 10 లక్షలకు తగ్గాయి.
- 2016లో 3.67 కోట్లకు గాను 1.95 కోట్ల మంది హెచ్‌ఐవీ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు.
- 1997-2016 మధ్య కొత్తగా హెచ్‌ఐవీ బారిన పడిన వారి సంఖ్య 35 లక్షల నుంచి 18 లక్షలకు తగ్గింది.
- 1980 నుంచి 7.61 కోట్ల మంది హెచ్‌ఐవీ బారిన పడగా 3.5 కోట్ల మంది ఎయిడ్స్‌తో మృతి చెందారు.
- హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ కనుగొనడం లేదా నయం చేయడానికి ఇంతవరకు వీల్లేకున్నా బాధితులు ఈ వైరస్‌ వృద్ధి చెందకుండా జీవితకాం చికిత్స పొందవచ్చు.
- ప్రపంచంలో సగం మంది బాధితులుండే తూర్పు, దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎయిడ్స్‌ తగ్గుతోంది. 2010 నుంచి ఈ ప్రాంతంలో ఎయిడ్స్‌ మరణాలు 42 శాతం తగ్గాయి.
- తూర్పు, దక్షిణాఫ్రికాతో పాటు పశ్చిమ, మధ్య ఐరోపా, అమెరికాల్లో 2020 నాటికి ‘90-90-90’ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 90 శాతం మంది చికిత్స తీసుకోవడం.. వారిలో 90 శాతం మంది తమ పరిస్థితిని గుర్తించడం. ఇందులో 90 శాతం మందిలో మందు ద్వారా వైరస్‌ను నియంత్రించడం. 2016 నాటికి ఇది ‘70-77-82’గా ఉంది.
- మధ్య ప్రాచ్య ఉత్తరాఫ్రికా.. తూర్పు ఐరోపా-మధ్య ఆసియా ప్రాంతాల్లో ఎయిడ్స్‌ పరిస్థితిపై యూఎన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ప్రాంతాలూ రాజకీయ అనిశ్చితి, వివాదాలతో సతమతమవుతున్నట్లు పేర్కొంది.

views: 1504

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams