Current Affairs Telugu Daily

విస్తృత ధర్మాసనానికి శబరిమల  కేసు 

*కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నవంబర్ 14 వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 
* సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌   వ్యాఖ్యలు-----
‘మతమంటే ఏంటి? మత విశ్వాసాలు ఏమున్నాయి? అనే అంశంపై చర్చ జరపాలని పిటిషనర్లు మమ్మల్ని కోరారు. నిజానికి ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదు. అయితే ఈ కేసు కేవలం ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాదు. మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
*ఈ కేసులో దాఖలైన 65 పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.
*శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ,శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతేడాది సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది.
*ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ నాయర్‌ సర్వీసెస్‌ సొసైటీ, దేవస్థాన తంత్రులు, ట్రావెన్‌కోర్‌ దేవసం బోర్డు సహా పలువురు భక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. 
*మొత్తంగా పలు హిందూ సంఘాలు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 65 పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లను సీజేఐ జస్టిస్ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
*ఈ కేసును ఎటూ తేల్చని ఐదుగురు జడ్జీల బెంచ్‌ దీనిని ఏడుగురు జడ్జీలున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని జస్టిస్‌ నారీమన్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యతిరేకించగా.. మెజారిటీ జడ్జీల నిర్ణయం మేరకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
* గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారు.
*అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని.. అందువల్ల ఆయన ఆలయంలోకి రుతు క్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని.. శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్తమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ- ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది.
**కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ తరఫున ఆరుగురు మహిళలు 2006లో సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది.
*మహిళల ప్రవేశానికి అనుమతించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు.
*కేరళలోని పతనంథిట్ట జిల్లాలో.. పశ్చిమ కనుమల్లోని శబరిమల శిఖరంపై ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం కొలువై ఉంది. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో, పెరియార్‌ పులుల అభయారణ్యంలో 18 గుట్టల మధ్య ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అంటే 'వృద్ధి' అని అర్థం. ఈ ఆలయానికి ఏటా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ గుడిని నవంబరు-డిసెంబరులో మండల పూజలకు, జనవరి 14న మకర సంక్రాంతికి, ఏప్రిల్‌ 14న విషువ పండుగకు, మలయాళ నెలల్లోని ప్రతి మొదటి అయిదు రోజుల సమయంలో భక్తులకు పూజలు చేసుకోవడానికి తెరుస్తారు.
*పురాణాల ప్రకారం.. హరిహరుల(మోహిని, శివుడు)కు జన్మించిన శిశువును వారు పంపానది ఒడ్డున వదిలేసి వెళ్లారు. సంతానం లేని పందళం రాజు రాజశేఖర అడవిలోకి వేటకు వెళ్లినపుడు ఆ శిశువు కనిపించాడు. అతన్ని రాజు తన రాజమందిరానికి తెచ్చి పెంచుకున్నారు. మణికంఠన్‌ అని నామకరణం చేశారు. ఆ బాలుడికి అద్వితీయ శక్తులుండేవి. కొన్నాళ్లకు రాజుకు ఓ కొడుకు పుట్టగా ఆ బాలుడి భవిష్యత్తును కాంక్షించిన రాజు భార్య- మణికంఠన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసేది. ఒకసారి అడవిలోకి వెళ్లి పులి పాలు తీసుకురావాలని మణికంఠన్‌ను పురమాయించింది. మణికంఠన్‌ అడవిలోకి వెళ్లి.. ఏకంగా పులిపైనే సవారీ చేస్తూ తిరిగొచ్చాడు. తన భార్య తప్పుల్ని క్షమించాలని రాజు- మణికంఠన్‌ను వేడుకున్నారు. మీ పేరిట ఒక ఆలయాన్ని నిర్మిస్తానని రాజు చెప్పారు. ఆలయాన్ని నిర్మించాల్సిన ప్రదేశాన్ని సూచిస్తూ బాణాన్ని ప్రయోగించిన మణికంఠన్‌ ఆ తర్వాత అక్కడి నుంచి మాయమై, దేవతల్లో కలిసిపోయారని చెబుతారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత పరశురాముడు అయ్యప్పస్వామి విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి రోజు ప్రతిష్ఠించారని ప్రతీతి. దట్టమైన పుంగావనం అడవిలో 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.


views: 626Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams