Current Affairs Telugu Daily

భారత్ కు  బై బై చెప్పనున్న వోడాఫోన్ 

*బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ పరిస్థితులు అనుకూలించకపోతే త్వరలో భారత మార్కెట్‌ నుంచి వైదొలగాల్సి రావచ్చని సంకేతాలిచ్చింది.టెలికాం కంపెనీలు రూ.92వేల కోట్ల మేరకు ఏజీఆర్‌ చార్జీలు చెల్లించాలని అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర ప్రభావం చూపుతోంది. 
*వొడాఫోన్‌ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్‌ రీడ్‌ --సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానంగా టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన వేల కోట్ల ఏజీఆర్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం కొంత ఊరట కల్పించాలి, లేదంటే భారత్‌లో కంపెనీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంలో పడుతుంది. దశాబ్దకాలం నుంచి వివాదం నెలకొన్న ఈ బకాయిల గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రొవిజనింగ్‌ జరపలేదు. మద్దతు లేని నిబంధనలు, అధిక పన్నుల వల్ల కంపెనీ ఆర్థికంగా పెను భారాన్ని మోస్తోందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలతను మరింత పెంచింది అని ఈయన పేర్కొన్నారు. 
*వొడాఫోన్‌ పీఎల్‌సీ భారత మార్కెట్‌ నుంచి వైదొలగవచ్చని గతనెలలోనే అంతా భావించారు. 
*వొడాఫోన్‌ భారత జాయిం ట్‌ వెంచర్‌(జేవీ) ‘వొడాఫోన్‌ ఐడియా’ నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ప్రతినెలా లక్షల సంఖ్యలో కస్టమర్లు ఈ కంపెనీ నెట్‌వర్క్‌ను వీడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కంపెనీ మార్కెట్‌ విలువ భారీగా పతనమైంది.
*సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) పద్ధతిన లైసెన్సు, ఇతర ఫీజుల లెక్కింపుపై దశాబ్దం క్రితం టెలికాం శాఖ, టెల్కోల మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదంపై టెలీకమ్యూనికేషన్స్‌ డిస్ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ అపిలేట్‌ ట్రిబ్యునల్‌(టీడీశాట్‌) టెలికాం కంపెనీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
*ఈ విషయంపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం మాత్రం ప్రభుత్వ వాదనకు మద్దతు తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఏజీఆర్‌ బకాయిలను అసలు, వడ్డీ, జరిమానా, దానిపైనా వడ్డీతో సహా చెల్లించాలని గతనెల 24న కోర్టు టెల్కోలను ఆదేశించింది.
*స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని ఏజీఆర్‌ ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8శాతం లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాలి. 1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం(రెవెన్యూ షేరింగ్‌) కింద ఏజీఆర్‌ ఛార్జీలను ప్రవేశపెట్టారు. 
* ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపైనే అసలు వివాదం రాజుకొంది. టెలికాం సంస్థలు ఆర్జించిన మొత్తం ఆదాయంపై లెక్కగట్టాలని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ చెబుతోంది. దీనిలో వ్యాపారేతర ఆదాయం కూడా కలపాలని పేర్కొంది. అంటే.. ఆస్తుల అమ్మకాలు, డిపాజిట్లపై వడ్డీ వంటివి కూడా కలపాలని చెబుతోంది. దీనిని 2005లో సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ).. టీడీఎస్‌ఏటీ(టెలికాం డిస్ప్యూట్‌ సెటిల్మెంట్‌ అండ్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూన్‌)లో సవాలు చేసింది. దాదాపు 10ఏళ్లు సాగిన ఈ న్యాయపోరాటం 2015లో కొలిక్కి వచ్చింది. టెలికాం సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టెలికం యేతర విభాగాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏజీఆర్‌ నుంచి మినహాయించాలని పేర్కొంది. మరోపక్క టెలికం సంస్థలు తక్కువ ఆదాయాన్ని చూపుతున్నాయని కాగ్‌ పేర్కొంది.
*ఈ తీర్పుపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీడీఎస్‌ఏటీకు ఒప్పందంలోని నియమాలను, షరతులను సమీక్షించే అధికారం లేదని.. కేవలం ఒప్పందం చట్టపరమైందో..కాదో మాత్రమే చెప్పాలని కేంద్రం వాదించింది.
దీనిపై ఇటీవల సుప్రీం కోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేంద్రానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. టెలికాం సేవలేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌లో చేర్చింది. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొంది. దీనిపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేదని పేర్కొంది.
*సుప్రీం తీర్పుతో టెలికాం సంస్థలు రూ.92వేల కోట్లను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎయిర్‌టెల్‌ రూ. 21,682 కోట్లు, వొడాఫోన్‌ రూ. 19,823 కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ. 16,456 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ. 2,537 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2,098 కోట్లు బకాయి పడ్డాయి. వీటిపై వడ్డీలు, అపరాధ రుసుంలు కలిపి మొత్తం రూ.92,641 కోట్లకు చేరాయి. 1999-2000 మధ్య ఉన్న పలు సంస్థలు విలీనాలు, వ్యాపారాన్ని ఆపేయడం వంటివి జరిగాయి. వీటిల్లో ఇప్పుడు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాపైనే భారీగా భారం పడింది. ఎయిర్‌టెల్‌ రూ.42వేలకోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 40 వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. రిలయన్స్‌ జియో 2016లో వ్యాపారం ప్రారంభించడంతో ఈ సంస్థ చెల్లించాల్సిన మొత్తం చాలా తక్కువ ఉంది. 
*వాస్తవానికి ఈ సంస్థలు చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.23,189 కోట్లు మాత్రమే. కానీ, దాదాపు 14ఏళ్లపాటు న్యాయపోరాటం జరిగింది. దీంతో అసలుపై వడ్డీ రూ. 41,650 కోట్లు, ఆలస్యానికి అపరాధ రుసుం రూ.10,923 కోట్లు , దానిపై మళ్లీ వడ్డీ రూ. 16,878 కోట్లు కలిపి రూ.92,640 కోట్లకు చేరాయి. ఇప్పటికే టెలికాం రంగంలోని సంస్థలకు రూ.4లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయి. 
*ఈ తీర్పుతో ఎయిర్‌టెల్‌ రూ.21,700 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.28,300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఇండస్ట్రీపై రూ.1.4 లక్షల కోట్ల భారంపడింది.
*ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి వొడాఫోన్‌ భారత వ్యాపార నష్టం 69.2 కోట్ల యూరోలకు ఎగబాకింది. ఈ గ్రూపు మొత్తం నష్టం 190 కోట్ల డాలర్లు.


views: 812Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams