Event-Date: | 11-Nov-2019 |
Level: | National |
Topic: | Persons in News |
ఎన్నికల చండశాసనుడు
*మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్,ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్(86) కన్నుమూశారు.కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(నవంబర్-10,2019)రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు.
*తన పదవి కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలను గడగడలాడించారు.
*టీఎన్ శేషన్ పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్. ఆయన 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు.
*1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన సీఈసీగా సేవలు అందించారు. 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ తమిళనాడు కేడర్లో పనిచేశారు.
*1989లో కేంద్ర కేబినెట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఆయన అందించిన సేవలకు గాను 1996లో రామన్ మెగసెసే అవార్డు లభించింది.
*ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డీ దేవెగౌడ మారారు.
*దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలు చేయడం ద్వారా శేషన్ విశేష గుర్తింపు సాధించారు.
*కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే.. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా ఆయన కఠిన చర్యలు తీసుకున్నారు.
*గవర్నర్ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా మధ్యప్రదేశ్లోని ఓ నియోజకవర్గంలో ఏకంగా ఎన్నికలనే టీఎన్ శేషన్ రద్దు చేశారు.సదరు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
*ఎన్నికల సంస్కరణలకు టీఎన్ శేషన్ ఆద్యుడు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పుడు ఉపయోగిస్తున్న గుర్తింపు కార్డు ఐడియా ఆయనదే.
*ఎన్నికల నిబంధనావళి తూచా తప్పకుండా అమలు కావడానికి చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించారు.
*ఓటర్లకు లంచాలివ్వడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ,ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, కులం, మతం ప్రాతిపదికన ఓట్లు కోరడం, ప్రచారానికి ప్రార్థనా స్థలాలను వాడుకోవడం, అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడటం వంటి అంశాలపై సంస్కరణలు తీసుకువచ్చారు.