Current Affairs Telugu Daily

వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులు 

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన.. ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను అందిస్తారు. 
*ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు.
*సోషల్‌ వర్క్‌: సామాజిక, సేవా రంగాలు, సామాజిక ప్రాజెక్టులకు అందించిన సేవలు.  
ప్రజావ్యవహారాలు: న్యాయ, రాజకీయ, ప్రజాసేవలు
సైన్స్, ఇంజినీరింగ్‌: స్పేస్‌ ఇంజినీరింగ్, న్యూక్లియర్‌ సైన్స్, ఇన్‌ఫర్మేషన్‌  టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాల్లో పరిశోధన, అభివృద్ధి.
వ్యాపార వాణిజ్య రంగాలు : బ్యాకింగ్, ఆర్థిక వ్యవహారాలు, టూరిజం, వాణిజ్య నిర్వహణ, విస్తరణ.
ప్రింట్‌ మీడియా: విశిష్ట సేవలు అందించిన ఎడిటర్స్, జర్నలిస్టులు.  
ఎలక్ట్రానిక్‌ మీడియా: విశిష్ట సేవలు అదించిన వారు  
వైద్య రంగం: ఆయుర్వేద, హోమియో, సిద్ధ, అల్లోపతి, ప్రకృతి వైద్యం (నేచురోపతి) రంగాల్లో పరిశోధకులు.  
కళలు, సాహిత్యం, విద్య: జర్నలిజంతో సహా కళలు, సాహిత్యం, విద్యా రంగాల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన, బోధన, విద్యా విస్తరణ, సంస్కరణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు  
ప్రజాసేవ: పరిపాలన రంగంలో ప్రజలకు అత్యుత్తమ, అసాధారణ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు. 
క్రీడారంగం: ప్రసిద్ధ కీడ్రలు, అథ్లెటిక్స్, పర్వతారోహకులు, యోగా, క్రీడల విస్తరణకు పాటుపడ్డ వారు. వీటితోపాటు ఇందులో ప్రస్తావించని సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని కూడా ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.    
*పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్‌ కమిటీ పరిశీస్తుంది. 
*ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్‌) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు.  
*అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది.
* ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. 
ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరిస్తారు. 
*ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు. కాగా, 2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు.  


views: 607



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams