Current Affairs Telugu Daily

పర్యావరణ ముప్పుపై శాస్త్రవేత్తల పరిశోధన

*అత్యధిక ఉష్ణోగ్రతలు కరిగిపోతున్న మంచు ఖండాలు రుతువులల్లో మార్పులు,అతివృష్టి, అనావృష్టి అన్నింటికీ కారణం వాతావరణ మార్పులని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
*ప్రపంచం పర్యావరణపరంగా అత్యవసరస్థితిలో ఉందని 69 మంది భారతీయ శాస్త్రజ్ఞులు సహా 153 దేశాలకు చెందిన 11,258 మంది శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. 
*పర్యావరణానికి సంబంధించి వివిధ విభాగాల్లో నలభై ఏళ్ల డేటాను శాస్త్రీయంగా విశ్లేషించి మరీ రూపొందించిన పత్రం బయోసైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. దాన్ని ఈ 11,258 మంది శాస్త్రజ్ఞులు ఆమోదించారు.
*ఈ ఏడాది అక్టోబరు నెలను ‘అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన అక్టోబరు’గా ప్రకటించడాన్ని కేవలం ఉపరితల ఉష్ణోగ్రతలను కొలవడం సరిపోదని, పెరిగిపోతున్న భూతాపం వల్ల వచ్చే అసలైన ప్రమాదాలను గుర్తించడానికి అది సరిపోదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
*శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం,కర్బన ఉద్గారాల వినియోగాన్ని, పశువుల ఉత్పత్తిని, చెట్లు కొట్టేయడాన్ని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోకపోతే భూతాప ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. 
* పెరిగిపోతున్న భూతాపాన్ని.. మానవాళికి ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి ఆరు విభాగాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, తక్షణ చర్యలు తీసుకోవాలని శాస్త్రజ్ఞులు సూచించారు. 
ఇంధనం: శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. వాటి వినియోగాన్ని నిరుత్సాహపరిచేలా వాటిపై అత్యధికస్థాయిలో పన్నులు విధించాలి. శిలాజ ఇంధనాలను వినియోగించే సంస్థలకు రాయితీలను నిలిపేయాలి.
 మీథేన్‌, హైడ్రోఫ్లూరోకార్బన్స్‌ వంటివాటి వినియోగాన్ని తగ్గించాలి. తద్వారా స్వల్పకాలిక భూతాపం రానున్న కొన్ని దశాబ్దాల్లో 50% మేర తగ్గుతుంది.
ప్రకృతి పరిరక్షణ: అటవీ నిర్మూలనను అడ్డుకోవాలి. అడవులను, గడ్డిమైదానాలను, మడ అడవులను పునరుద్ధరించాలి.
ఆహారం: మాంసాహారాన్ని తగ్గించి శాకాహారాన్ని ప్రోత్సహించాలి. ఆహార వృథాను అరికట్టడం కూడా కీలకమే.
ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక వ్యవస్థలు కర్బన ఇంధనాలపై ఆధారపడే పరిస్థితిని మార్చాలి.
జనాభా: ప్రపంచవ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది దాకా జన్మిస్తున్నట్టు అంచనా. దీన్ని తగ్గించి జనాభాను స్థిరీకరించాలి.


views: 656



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams