Current Affairs Telugu Daily

థాయ్‌లాండ్‌లో సవస్దీ పీఎం మోదీ

*థాయ్‌లాండ్‌లోని ఎన్నారైలో ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు ‘సవస్దీ పీఎం మోదీ’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
*ఈ కార్యక్రమాన్ని భారత ఎంబసీ పర్యవేక్షిస్తుంది. 
*సవస్దీ అంటే థాయ్‌ భాషలో శుభాకాంక్షలు చెప్పడం లేదా వీడ్కోలు చెప్పడం. 
*ఈ సవస్దీ అనే పదం సంస్కృతంలోని ‘స్వస్థి’ అనే పదం నుంచి వచ్చింది.స్వస్థి అంటే శ్రేయస్సు అని అర్థం. 
*నవంబర్ నెల 3వ తేదీన బ్యాంకాక్‌ సమీపంలోని నొంతబురిలో జరిగే ఆసియాన్‌–ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు.
*స్వాస్‌దీ మోదీ/సవస్దీ మోదీ సభలో ప్రధాని ప్రసంగంలోని అంశాలు---
*దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ను రద్దు చేశాం. జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. థాయ్‌లాండ్‌లోనూ అదే విషయం ప్రతిధ్వనించింది అని ప్రసంగించారు. 
*4న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆర్‌సెప్‌ మూడో శిఖరాగ్ర సమావేశానికి  మోడీ హాజరవుతారు. 
* తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో ఆసియాన్‌లోని 10 దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పాల్గొంటాయి. 
* భారతదేశానికి జరిగే ప్రయోజనాల ప్రకారం  ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సీఈపీ) ఒప్పందంపై ప్రధాని మోడీ సంతకం చేస్తారు. 
ఆర్‌సీఈపీ--గురించి 2011 సంవత్సరం నుంచి చర్చల్లో ఉంటోంది. ఈ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అన్ని షరతులను భారత్‌ ఆమోదిస్తే అది దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదని కొందరి అభిప్రాయం.బయట నుంచి వచ్చే ఎలాంటి పోటీకి కూడా మన పరిశ్రమలు తట్టుకునే స్థితిలో లేవు. ఒప్పందం షరతులను అమలు చేస్తే భారతీయ పరిశ్రమలు మూసివేతకు గురవుతాయి.ఉక్కు, ఆటోమొబైల్స్, రసాయనాలు,  టెలికం, డెయిరీ, వ్యవసాయం వంటి అన్నిరంగాల్లోనూ భారీస్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది నియమితులయ్యారు. ఇలాంట ప్పుడు మన దేశీయ సామర్థ్యాలు బయటి శక్తుల ప్రభావానికి గురైతే ఈ రంగాలు ఏవీ తట్టుకుని నిలబడలేవు అని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 
* 1991 నుంచి  ప్రపంచీకరణ విధానంలో భాగంగా భారత ప్రభుత్వాలు ఉద్యోగాలకు, ఉపాధికి కాకుండా వృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రత్యేకించి 2001 నుంచి చైనా ఉత్పత్తులు భారత్‌కు వెల్లువలా తరలివచ్చాయి. 
*యాంటీ డంపింగ్‌ సుంకాలను కూడా కేంద్రం విదేశీ దిగుమతులపై విధించింది.2015–16 సంవత్సరాలలో నిర్మలా సీతారామన్‌ వాణిజ్య మంత్రిగా ఉండేటప్పుడు భారత్‌ ఆర్‌సీఈపీలో చేరడానికి సిద్ధంగా లేదని స్పష్టంచేశారు.
*ప్రభుత్వం ఏ విధానాలను పాటించినా, ఎలాంటి ఒప్పందాలపై చర్చించినా, అంతిమ ఫలితం మాత్రం దేశంలోని చివరి వ్యక్తి కూడా లబ్ధి పొందేలా ఉండాలి. 
*ఆర్‌సీఈపీ --ఆసియా ఖండంలోని కొన్ని దేశాల మధ్య చర్చల్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఈ ‘ఆర్‌సెప్'. ఆర్‌సెప్ అంటే - రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్( ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం)
*2012లో కంబోడియాలో జరిగిన ‘ఆసియాన్' సదస్సులో ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం గురించిన చర్చలు మొదలయ్యాయి.గత ఏడేళ్లుగా దీనిపై ఆయా దేశాల నడుమ సంప్రదింపులు సాగుతున్నాయి. ఒకవేళ ఒప్పందం కుదిరి ఆసియాన్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు దీనిపై సంతకాలు చేస్తే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ఒప్పందం అవుతుంది.
*దీనిలో 10 సభ్య దేశాలు, మరో 6 భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. సభ్య దేశాలు - సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, లావోస్, బ్రూనై, కంబోడియా. భాగస్వామ్య దేశాలు - భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ప్రస్తుతం ‘ఆర్‌సెప్'కి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. 
*ఈ ఏడాది మార్చిలో కంబోడియాలో ఆయా దేశాల మంత్రుల సమావేశం జరిగింది.ఒకపక్క అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, మరొకపక్క వివిధ దేశాల రక్షణాత్మక చర్యల కారణంగా త్వరితగతిన ఈ ఒప్పందం కుదిరేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. 
*సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ఒక అంగీకారానికి వచ్చి ‘ఆర్‌సెప్' కనుక విజయవంతం అయితే ఆయా దేశాల్లోని 350 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛా వాణిజ్యం.. అంటే ఓపెన్ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది.ఫలితంగా ‘ఆర్‌సెప్' దేశాలు తమ దేశంలో తయారయ్యే ఉత్పత్తుల విక్రయాల కోసం సభ్య దేశాల మార్కెట్‌‌ల‌‌ను వాడుకుంటాయి.
*వాణిజ్య ఒప్పందాలు అనేవి ఇరుపక్షాలకూ ప్రయోజనకరంగా ఉండాలి. అయితే కొన్ని ఒప్పందాలు అలా ఉండడం లేదు. ‘ఆర్‌సెప్'లో భారత్, చైనాలే కీలకం.
*చైనా ఉత్పత్తులు యధేచ్ఛగా భారత్‌లోకి వచ్చిపడుతున్నా చైనా మార్కెట్‌లోకి భారత్ అంత సులభంగా వెళ్లలేకపోతోంది. అలాగే మిగిలిన దేశాలు కూడా. ఇవి అంత భారత్, చైనా మార్కెట్‌లలోకి సులువుగా ప్రవేశించలేకపోతున్నాయి.
*భారత్ ముందున్న సవాళ్లు ---- మౌలిక వసతులు, ఎగుమతులు తక్కువగా ఉండడం, దిగుమతుల్లోనూ హెచ్చుతగ్గులు, కఠిన కార్మిక చట్టాలు, సంక్లిష్టమైన పన్ను వ్యవస్థ, అధికారస్వామ్యం, పైగా కరెన్సీ మారకంలో డాలర్‌తో పోల్చితే మన రూపాయి విలువ బాగా తక్కువ ఉండడం.మన మార్కెట్‌లోకి చైనా ప్రవేశించినంత సులువుగా మనం చైనా మార్కెట్‌లోకి ప్రవేశించలేకపోతున్నాం.
*చైనాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది.అనుమతులు పొందడంతో తీవ్ర జాప్యం కారణంగా ఫార్మాతోపాటు ఇతర రంగాలకు సంబంధించి మనం చైనా మార్కెట్‌లోకి అడుగుపెట్టలేకపోతున్నాం. రక్షణాత్మక విధానాలు అవలంభించడం కూడా మరొక కారణం.
*భారత్ వాణిజ్యం ----చైనాతో భారత్‌కు వాణిజ్య లోటు అధికంగా ఉంటోంది. ఆర్‌సెప్ దేశాలన్నింటితో కలిపి మన వాణిజ్య లోటు 105 బిలియన్ డాలర్లు అయితే, ఇందులో సగం వాణిజ్య లోటు ఒక్క చైనాతోనే ఉంటోంది.దిగుమతులు మరింత అధికమై దేశంలోని తయారీ రంగం దెబ్బతింటుంది.ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, లోహాలు, డైరీ పరిశ్రమ తదితర రంగాల్లో చైనా మనకంటే ముందే ఉంటోంది.
*ఆర్‌సీఈపీ --భారత్ కి కలిగే ప్రయోజనాలు---తయారీ రంగంలోని అధిక సామర్థ్యమే మన దేశ వాణిజ్య రంగానికి ఆధారం. అయినప్పటికీ ప్రపంచ తయారీ రంగంలో మన దేశ వాటా 2 శాతమే. ఈ వాటా 1 శాతం పెరిగినా మన దేశంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్‌సెప్' మన దేశానికి ఎంతో కీలకం.స్వేచ్ఛాయుత వాణిజ్య విధానంలో డిజైనింగ్, నైపుణ్యం, సరఫరా సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని భారతదేశం వాణిజ్య పరిధిని పెంచుకోవాలి.దేశంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, ‘ఆర్‌సెప్' దేశాలకు ఎగుమతులు పెంచగలగాలి.


views: 715Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams